ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానుల అంశం హాస్యాస్పదమని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి అన్నారు. హైకోర్టు వచ్చినంత మాత్రాన ఆ ప్రాంతాన్ని ఎవరు రాజధాని అనరని చెప్పారు. హైదరాబాదులో రాష్ట్రపతి కోవింద్ ను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ ప్రజలకు మంచి జరగాలనేదే బీజేపీ ఆకాంక్ష అని ఆ పార్టీ సుజనా చౌదరి అన్నారు.
వైసీపీ ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని అన్నారు. వారికి కావాలనుకుంటే జగతి పబ్లికేషన్స్, భారతి సిమెంట్స్ ను వారి ఇష్టానుసారం మార్చుకోవచ్చని, కార్పొరేట్ ఆఫీసును రాష్ట్రంలో ఎక్కడికైనా మార్చుకోవచ్చని… రాజధానిని కూడా వారు కార్పొరేట్ సంస్థగా భావిస్తున్నట్టున్నారని దుయ్యబట్టారు.
గొప్ప జీఎన్ రావు గారు ఒక సెషన్ (బడ్జెట్ సెషన్) వైజాగులో అంటూ నివేదికలో చెప్పారని విమర్శించారు. రెండేళ్ల వయసున్న పిల్లవాడు కూడా ఇది వింటే నవ్వుతాడని అన్నారు.వైసీపీ వాళ్లు ఆరోపించే విధంగా తాను ఆరోపణలు చేయలేనని అన్నారు. రాజధానిపై వారి నిర్ణయాన్ని మాత్రం తప్పుబడుతున్నానని చెప్పారు.