నేడు రాష్ట్రంలో బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా బహిరంగ సభలో పాల్గొన్నారు. వచ్చే ఎన్నికలలో బీజేపీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం ఉందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో బీజేపీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సందర్భంగా టీడీపీ సహా పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరారు. బీజేపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన నడ్డా వారికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సభలో ఆయన మాట్లాడుతూ, ప్రపంచానికి నచ్చిన ఆయుష్మాన్ భారత్ పథకం తెలంగాణ సీఎంకు నచ్చకపోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరగానే ఎయిమ్స్ మంజూరు చేశామని చెప్పారు. కశ్మీర్ పై మోదీ సాహసోపేతమైన నిర్ణయానికి అందరూ కృతఙ్ఞతలు చెబుతున్నానని, దశాబ్దాల కశ్మీర్ సమస్యను మోదీ ప్రభుత్వం పరిష్కరించిందని అన్నారు. భారత్ త్వరలోనే 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ గల దేశంగా అవతరిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. బీజేపీ సభ ముగిసిన అనంతరం బీజేపీ కార్యాలయానికి ఆయన బయలుదేరి వెళ్లారు. కాసేపట్లో పార్టీ రాష్ట్ర కోర్ కమిటీతో సమావేశం కానున్నారు. పార్టీ బలోపేతం, పురపాలక ఎన్నికలు, సభ్యత్వ నమోదుపై చర్చించారు.
ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఇన్నాళ్లూ ఆర్టికల్ 370ను కొనసాగించారని కాంగ్రెస్ పార్టీపై బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శలు చేశారు. హైదరాబాద్ లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీకి స్వప్రయోజనాలే ముఖ్యం తప్ప, దేశ ప్రయోజనాలు అవసరంలేదని నిప్పులు చెరిగారు. ట్రిపుల్ తలాక్ రద్దుతో చారిత్రక తప్పిదాన్ని సరిచేశామని అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పేదొకటి, చేసేదొకటని, పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. రాష్ట్రంలో నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమంలో భారీగా అవినీతి జరుగుతోందని, ఇందుకు సంబంధించిన లెక్కలు, ఆడిటింగ్ చూపించడం లేదని, ముప్పై వేల కోట్లతో నిర్మించాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టును లక్ష కోట్లకు పెంచారని. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు పవిత్రమైన పేరు పెట్టి కోట్లు దోచుకుంటున్నారని, మిషన్ కాకతీయ పథకం ‘మిషన్ ఫర్ కమిషన్’ గా మారిందని ఆరోపించారు.
ఇప్పటి వరకూ రెండు పడకలగదుల ఇల్లు ఎన్ని నిర్మించి ఇచ్చిందని ప్రశ్నించారు నడ్డా. వాస్తు పేరుతో సచివాలయాన్ని కూలగొడుతున్నారని ధ్వజమెత్తిన నడ్డా, ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరుతున్నవారిని చూసి టీఆర్ఎస్ కడుపుమండుతోందని, టీఆర్ఎస్ నేతలు కూడా తమ పార్టీలో చేరేందుకు చూస్తున్నారని వ్యాఖ్యానించారు.