బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ సుశాంత్ కేసుకు సంబంధించిన విచారణలో పోలీసుల తీరును తప్పుబట్టడమే గాక ముంబై నగరం పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను తలపిస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. దీంతో ఈ ఇష్యూ పలు వివాదాలకు దారితీసింది. ఈ క్రమంలోనే ఈరోజు ఉదయం హిమాచల్ ప్రదేశ్ నుంచి బయల్దేరిన కంగనా తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నడుమ ముంబైలో ల్యాండ్ అయింది. ఇదిలా ఉంటే నేటి ఉదయం ముంబై బంద్రాలో ఉన్న కంగనా రనౌత్ నివాసంలో అక్రమ నిర్మాణాలను తొలగించే ప్రయత్నం చేసింది బీఎంసీ. బీఎంసీ అధికారి ఒకరు మాట్లాడుతూ, బాలీవుడ్ నటి కంగన రనౌత్‌కు చెందిన బాంద్రా బంగళాలో చట్టవిరుద్ధ మార్పులను కూల్చినట్లు తెలిపారు. ఈ మార్పులకు బీఎంసీ నుంచి అనుమతులు పొందలేదన్నారు. అయితే ఈ కూల్చివేతపై స్టే విధించాలని బాంబే హైకోర్టును ఆశ్రయించిన కంగనాకు కాస్త ఊరట కలిగింది. కూల్చివేతపై స్టే విధిస్తూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యం స్వామి బుధవారం కంగన రనౌత్‌కు మద్దతు తెలిపారు. ఆత్మస్థయిర్యంతో నడచుకోవాలని, ఈ కష్టకాలంలో తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కాగా బుధవారం కంగన రనౌత్ “నా ఇంట్లో ఎటువంటి చట్టవిరుద్ధ నిర్మాణం లేదు. అంతేకాకుండా ప్రభుత్వం కోవిడ్ సమయంలో కూల్చివేతలను సెప్టెంబరు 30 వరకు నిషేధించింది. బుల్లీవుడ్! ఇప్పుడు దీనిని గమనించు, నియంతృత్వం ఇలాగే ఉంటుంది. ప్రజాస్వామ్యం చచ్చింది’’ అని మండిపడ్డారు.