telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఈవీఎంలపై జీవీఎల్‌ పుస్తకం రాశారు.. ఇప్పుడు మాట మార్చారు!

BJP MP Gvl EVMs Book viral

ఈవీఎంల పనితీరుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ప్రత్యర్తులు విమర్శలు గుప్పిస్తున్నారు. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు బాబు తీరు పై విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో గతంలో ఈవీఎంల పనితీరు చాలా ప్రమాదకరంగా మారిందని, వాటివల్ల ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందంటూ గతంలో జీవీఎల్ రాసిన పుస్తకం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ‘డెమోక్రసీ ఎట్ రిస్క్ డ్యూ టు ఈవీఎమ్స్’ పేరుతో వచ్చిన ఈ పుస్తకంలో 230 పేజీలున్నాయి. ఈ పుస్తకంలో వివిధ దేశాల్లోని ఘటనలను ఉదహరించారు.

అప్పట్లోనే చంద్రబాబు ఈవీఎం పద్ధతిపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇప్పుడూ చేస్తున్నారు. కానీ ఈవీఎంల వల్ల ప్రజాస్వామ్యానికే ప్రమాదం ఏర్పడిందంటూ అంత పెద్ద పుస్తకం రాసిన జీవీఎల్ మాత్రం మాట మార్చారు. ఈవీఎంల పనితీరు భేష్ అంటూ కొనియాడుతుండడంపై నెటిజన్లు దుయ్యబడుతున్నారు. అప్పట్లో ఒడిశా ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేసినా బీజేడీకే పడుతున్నాయని, పోలింగ్ 52.6 శాతం నమోదైందని పీవో ప్రకటిస్తే కౌంటింగ్ నాటికి అది 65.9 శాతానికి చేరిందని ఆ పుస్తకంలో జీవీఎల్ ప్రస్తావించారు.

అలాగే, ఈవీఎంల పనితీరును నిరసిస్తూ తమిళనాడులో జయలలిత ఐదు అసెంబ్లీ ఉప ఎన్నికలను బహిష్కరించిన విషయాన్ని కూడా ఆ పుస్తకంలో ప్రస్తావించారు. నోయిడాలో ఓ పోలింగ్ బూత్‌లో మొత్తం 417 ఓట్లు పోలయితే 415 ఓట్లు ఇండిపెండెంట్ అభ్యర్థికే వచ్చాయని పేర్కొన్నారు. అలాగే, ఏపీతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాలలో తలెత్తిన ఈవీఎం లోపాలను కూడా రాసుకొచ్చారు. వివిధ పార్టీల అభిప్రాయాలను కూడా తీసుకున్నారు. అమెరికా, బ్రెజిల్‌ వంటి దేశాల్లోనూ ఈవీఎంలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని వివరించారు.అలా ఆ పుస్తకంలో మొత్తం ఈవీఎంల పద్ధతిపై దుమ్మెత్తిపోసిన జీవీఎల్ నేడు వాటిని సమర్థిస్తూ మాట్లాడుతుండడంపై సర్వత్ర నిరసన వ్యక్తమవుతోంది.

Related posts