telugu navyamedia
తెలంగాణ వార్తలు

బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అరెస్ట్‌..లాలాగూడ పీఎస్ కు త‌ర‌లించిన పోలీసులు

*బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అరెస్ట్‌
*లాలాగూడ పీఎస్ కు త‌ర‌లించిన పోలీసులు

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు అరెస్టు చేశారు. స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారుఖీ హైదరాబాద్‌లో నిర్వహించనున్నకామెడీ షోను అడ్డుకుంటామని,  వేదికను తగలబెడతామని.. షో జరుగుతున్నప్పుడు..   ఫారుఖీపై దాడి చేస్తామని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రకటించడంతో కలకలం రేగింది.

ఈ క్రమంలో రాజాసింగ్ ఇంటికి చేరుకున్న పోలీసులు.. ఆయనను అదుపులోకి తీసుకుని లాలా గూడ పీఎస్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అరెస్ట్ సందర్భంగా పోలీసులకు, రాజాసింగ్ అనుచరులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రాజాసింగ్ బయటకు రావొద్దని చెప్పినా వినలేదని, అందుకే అరెస్ట్ చేశామని పోలీసులు చెప్పారు.

మ‌రోవైపు మునావర్ ఫారుఖీ హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో శనివారం సాయంత్రం ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈ షోకి నిన్న మాదాపూర్ పోలీసులు అనుమ‌తించారు. దాదాపు రెండు వేల టికెట్లు నిర్వాహకులు అమ్మినట్లు సమాచారం.

మునావర్ ఫారుఖీ రాక విషయాన్ని కూడా పోలీసులు గోప్యంగా ఉంచారు. ఆయనకు పూర్తి భద్రత కల్పించారు. శిల్పకళా వేదిక చుట్టూ పెద్ద ఎత్తున పోలీసుల్ని మోహరించారు.  మునావర్ ఫారుఖీ షోకు అనుమతులు ఉన్నాయని మాదాపూర్ డీసీపీ ప్రకటించారు.   ఎవరైనా అశాంతి సృష్టించాలని చూస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సాయంత్రం షో మొదలై ముగిసే వరకు పోలీసులు అన్ని‌చోట్ల బందోబస్తు ఉంటుందని పోలీసులు ప్రకటించారు. 

Related posts