బీజేపీ ఎమ్మెల్యేను ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందున కమిషన్ అరెస్టు చేయించిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నీముచ్ పట్టణంలో వెలుగుచూసింది. గత ఏడాది డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యే దిలీప్ సింగ్ పరిహర్ నియమావళిని ఉల్లంఘించినందుకు, అతన్ని ఎన్నికల కమిషన్ హెచ్చరిక జారీ చేసింది. మళ్లీ ఈ నెల 23వతేదీన మందసర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి నామినేషన్ వేసిన సిట్టింగ్ ఎంపీ సుధీర్ గుప్తాతో కలిసి బీజేపీ ఎమ్మెల్యే దిలీప్ సింగ్ పరిహర్ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు.
అధికారుల అనుమతి తీసుకోకుండానే బైక్ ర్యాలీ జరిపి, బాణసంచా కాల్చారు. దీనిపై ఆగ్రహించిన ఎన్నికల ఫ్లయింగ్ స్వ్కాడ్ ఎమ్మెల్యే పరిహర్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎన్నికల అధికారుల ఫిర్యాదు మేర పోలీసులు ఎమ్మెల్యే పరిహర్ తోపాటు నీమచ్ నగరపాలిక ఛైర్మన్ రాకేష్ జైన్, మరో ముగ్గురు బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేశారు. కోర్టులో బీజేపీ నేతలు బెయిలుకు దరఖాస్తు చేసుకోగా జడ్జి ఎమ్మెల్యే పరిహర్, మున్సిపల్ ఛైర్మన్ జైన్ లకు బెయిలు నిరాకరించారు. ముగ్గురు బీజేపీ కార్యకర్తలకు మాత్రం జడ్జి బెయిలు మంజూరు చేశారు. మోడల్ కోడ్ ఉల్లంఘిస్తే ఈసీ అరెస్టు చేయించవచ్చని ఈ ఘటన రుజువు చేసింది.