telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

షుజా ఆరోపణలను ఖండించిన కిషన్ రెడ్డి

2014 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తాను హత్యా రాజకీయాలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై బీజేపీ నేత కిషన్ రెడ్డి స్పందించారు.    బుధవారం  ఆయన మీడియాతో మాట్లాడుతూ తనపై ఇలాంటి ఆరోపణలు రావడం బాధాకరమని అన్నారు. సయ్యద్ షుజా అనే వ్యక్తి అమెరికాలో నివాసం ఉంటూ, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ బీజేపీ, ఈసీతో పాటు తనపై అనేక ఆరోపణలు చేశారని అన్నారు. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ ద్వారా బీజేపీ గెలిచిందని, సైబర్ ఎక్స్‌పెర్ట్‌గా చెప్పుకుంటూ సుజా చేసిన ఆరోపణలను ఖండిస్తున్నట్లు ఆయన చెప్పారు.
కాంగ్రెస్‌ కుట్రలో భాగంగానే తనపై సయ్యద్‌ షుజా ఆరోపణలు చేశారని కిషన్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్‌ నేత కపిల్ సిబల్‌ సమక్షంలోనే సుజా మాట్లాడారని ఈవీఎంల్లో లోపాలు ఉంటే రుజువు చేయాలని ఆయన సవాల్ చేశారు. బీజేపీ నేత కిషన్‌రెడ్డి బావమరిది కాకిరెడ్డి గెస్ట్‌హౌస్‌లో తమపై కాల్పులు జరిపారని సయ్యద్ సుజా ఆరోపించారు. కాకిరెడ్డి అనే వ్యక్తి ఎవరో తనకు తెలియదని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. 11 మందిని హత్య చేయిస్తే అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎందుకు కేసు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు. సుజా ఆరోపణలపై తెలంగాణ ప్రభుత్వం విచారణ జరిపించాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు.

Related posts