శ్రీవారి ఆస్తులను విక్రయించేందుకు టీటీడీ నిర్ణయించినట్టు కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. తమిళనాడులోని 23 ప్రాంతాల్లో ఉన్న ఆస్తులను అమ్మడం ద్వారా రూ.100 కోట్లు సమకూర్చుకోవాలని టీటీడీ భావిస్తున్నట్టు సమాచారం. దీనికోసం అనేక కమిటీలు ఏర్పాటు చేయడం విమర్శలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీటీడీ ఆస్తులు అమ్మే హక్కు మీకెక్కడిది అంటూ సర్కారుపై మండిపడ్డారు.
తిరుమల వెంకన్నకు భక్తులు ఇచ్చిన ఆస్తిని నిర్వహించడానికి మాత్రమే మీకు హక్కు ఉంది. అలాంటిది మీరెలా వేలం వేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా చూస్తుంటే దీని వెనుక హిందుత్వాన్ని అణగదొక్కే కుట్ర దాగివుందనే అనుమానం కలుగుతోందని వ్యాఖ్యానించారు. టీటీడీ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న ధోరణిపై బీజేపీ రాజీలేని పోరాటం సాగిస్తుందని కన్నా స్పష్టం చేశారు.