telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

గ్రేటర్‌ ఎన్నికలు : గందరగోళంగా బీజేపీ, జనసేన పొత్తు!

గ్రేటర్‌ ఎన్నికల్లో బీజేపీ, జనసేన పొత్తు వ్యవహారం గందరగోళంగా మారింది. మొదట ఒంటరి పోరుకు మొగ్గు చూపిన జనసేన.. తర్వాత బీజేపీ కలిసి రాబోతుందంటూ చేసిన ప్రకటన ఆసక్తిని పెంచింది. కానీ.. ప్రచారానికి మాత్రమే జనసేనానిని వాడుకుంటామని చెప్పింది బీజేపీ. ఎన్నికల హీట్ హైపిచ్‌లో ఉన్న సమయంలో ఈ దాగుడుమూతలు ఏంటి? ఎందుకు?  ఏపీలో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని చెప్పాయి. రెండు పార్టీలు కలిసి అనేక దఫాలుగా ఉమ్మడి సమావేశాలు నిర్వహించాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడైన తర్వాత బండి సంజయ్‌ సైతం వెళ్లి పవన్‌ను కలిసి మాట్లాడి వచ్చారు. ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలో పవన్‌ కల్యాణ్ బీజేపీ తరఫున ప్రచారం చేస్తారని కూడా చర్చ జరిగింది. పవన్‌ వెళ్లలేదు. కానీ దుబ్బాకలో బీజేపీ గెలిచింది.  ఇంతలో GHMC ఎన్నికల నగారా మోగడంతో పోటీ చేస్తున్నట్టు జనసేన ప్రకటించింది. దుబ్బాక విజయంతో జోష్‌ మీద ఉన్న బీజేపీ 150 డివిజన్లలో బరిలో దిగేందుకు సిద్ధమైంది. అయితే రెండు పార్టీల మధ్య పొత్తు దిశగా ఎలాంటి చర్చ జరగలేదు. ఏపీలో జనసేన కావాలని అనుకున్న బీజేపీ.. తెలంగాణలో వద్దనుకుందో ఏమో ఆ మాటే ఎత్తలేదు. కాకపోతే ఎన్నికల హీట్‌ హైపిచ్‌కు చేరుకున్న సమయంలో బీజేపీ- జనసేన మధ్య పొత్తు ఉంటుందని కాసేపు.. లేదని మరికాసేపు జరిగిన ప్రచారం గందరగోళానికి దారితీసింది. జనసేన విడుదల చేసిన ప్రకటన.. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ చేసిన కామెంట్స్‌ చూసిన రెండు పార్టీల కార్యకర్తలకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు.
పవన్‌ కల్యాణ్‌తో మాట్లాడేందుకు బండి సంజయ్‌ జనసేన ఆఫీసుకు వస్తున్నారని.. పొత్తుపై మాట్లాడతారని జనసేన వర్గాలు అధికారిక ప్రకటన విడుదల చేశాయి. ఈ ప్రకటన వచ్చిన టైమ్‌లోనే మీడియాతో మాట్లాడుతున్నారు బండి సంజయ్‌. జనసేనతో పొత్తు లేదని ఆయన తేల్చి చెప్పేశారు. అంతేకాదు.. నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాతే పవన్‌ను కలిసి మాట్లాడతానని తెలిపారాయన. పవన్‌ను ప్రచారానికి ఆహ్వానిస్తానని బండి వెల్లడించారు. ఇక్కడ కూడా కామెడీ ఉంది. జనసేన సొంతంగా పోటీ చేస్తుంటే.. బీజేపీ తరఫున పవన్‌ ఎలా ప్రచారానికి వస్తారో కమలనాథులే చెప్పాలి.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్‌ తదితర పక్షాలు మహాకూటమిగా బరిలో దిగడం..ఆ సందర్భంగా జరిగిన ప్రచారాన్ని బీజేపీ నాయకులు గుర్తు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఆ కూటమిలో ఉన్న చంద్రబాబును ఆంధ్రా నేతగా ప్రొజెక్ట్‌ చేశారు టీఆర్‌ఎస్‌ నాయకులు. మళ్లీ తెలంగాణపై ఆంధ్రవాళ్ల పెత్తనం అని విమర్శలు చేశారు. ఆ ప్రచారం కూటమికి ప్రతికూలంగా మారిందన్నది కాంగ్రెస్‌ వర్గాలు అనుకుంటాయి. ఇప్పుడు పవన్‌ కల్యాణ్‌ తెలంగాణలో బీజేపీతో కలిస్తే అదే ప్రచారం తెరపైకి వస్తుందని ఆందోళన చెందారో ఏమో.. కమలనాథులు ఆ ఊసే ఎత్తలేదని చెబుతున్నారు.
దుబ్బాక విజయంతో ఊపుమీద ఉన్న సమయంలో పవన్‌ను చంకన పెట్టుకుని వెళ్లడం అదేదో సామెతను గుర్తు చేస్తుందని వెనక్కి తగ్గరాని చెవులు కొరుక్కుంటున్నారట. మొత్తానికి ఏపీలో పొత్తు.. తెలంగాణలో దోస్తీ అన్న ఈక్వేషన్స్‌ ఆసక్తిగా మారాయనే చెప్పాలి.

Related posts