telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

ఎంఐఎం చేతిలో కీలుబొమ్మగా తెరాస.. నాటి స్ఫూర్తికి విరుద్ధం.. : మురళీధర్ రావు

bjp comments on trs and mim parties

తెలుగు రాష్ట్రాలను వచ్చే ఎన్నికలలో ఎలాగైనా హస్తగతం చేసుకునే ప్రయత్నాలలో బీజేపీ ఉంది. దానికి ఉన్న ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటుంది. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో అవకాశాలు వచ్చినప్పుడల్లా తమదే వచ్చే ఎన్నికలలో విజయం అంటూ చెప్పుకుంటూనే ఉంది. తాజాగా ఆ పార్టీ నేత మురళీధర్ రావు తెరాస పై తీవ్ర విమర్శలు చేశారు. ఆ పార్టీ ఎంఐఎం చేతిలో కీలుబొమ్మ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో ఎటువంటి అనుమానం లేదని అన్నారు. నాడు నిజాం, రజాకార్ల ఛాందస వాదానికి తెలంగాణ ప్రజలు వ్యతిరేకంగా పోరాడారని, ఆ పోరాటాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం నేడు నీరుగార్చిందని విమర్శించారు.

రజాకార్ల ఛాందసవాదానికి వ్యతిరేకంగా పోరాడిన సమరయోథులను గౌరవించని టీఆర్ఎస్ ను, ఆ పార్టీ మత ఛాందసవాద రాజకీయాలను ప్రజలు అంగీకరించరని అన్నారు. టీఆర్ఎస్ ను ఎదుర్కొనే శక్తి కాంగ్రెస్ పార్టీకి లేదని, ఆ పార్టీని ఎదుర్కొనే శక్తి కేవలం, బీజేపీకి మాత్రమే ఉందని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో టీఆర్ఎస్ కు నిజమైన ప్రతిపక్షం అవసరమని, ఆ పాత్రను పోషించగలిగేది బీజేపీయే అని అన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీ పోరాడాల్సి ఉంటుందని, ప్రతిపక్షంగా వ్యవహరించాల్సి ఉంటుందని అన్నారు. టీఆర్ఎస్ విధానాలను ఎండగడతామని, అప్పుడు మాత్రమే ప్రజల్లో తమ పార్టీపై విశ్వాసం పెరుగుతుందని, టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ అని ప్రజలు నమ్ముతారని అభిప్రాయపడ్డారు. 2023లో తెలంగాణలో బీజేపీ అధికార పక్షం కావడం ఖాయమని మురళీధర్ రావు ధీమా వ్యక్తం చేశారు.

Related posts