వచ్చే సార్వత్రిక ఎన్నికల సన్నాహాల కోసం బీజేపీని బలోపేతం చేసేందుకు దేశవ్యాప్తంగా పర్యటించున్నట్లు జెపీ నడ్డా తెలిపారు. “రాష్ట్రీయ విస్త్రత్ ప్రవాస్” పేరుతో వంద రోజుల పాటు పర్యటించనున్నారు. 2019లో పార్టీ అపజయం పాలైన స్థానాల్లో కూడా బలోపేతం చేసేందుకు..2024లో ఆ సీట్లను ఎలా గెలుచుకోవాలనే దానిపై ప్రణాళిక రూపొందించేందుకు ఈ పర్యటనలో ప్రాధాన్యతనివ్వనున్నట్లు తెలిపారు. ఇటీవల బీహార్ ఎన్నికల్లో విజయం సాధించడంపై ప్రధాని మోడీ నడ్డాను ప్రశంసించిన విషయం తెలిసిందే.. పార్టీ ప్రజా ప్రతినిధులతో సమావేశమవడం, కొత్త కూటములపై చర్చించడం, బీజేపీ పాలిత ప్రాంతాల ప్రతిష్టను మరింత ఇనుమడించేలా చర్యలు తీసుకోవడం, కేడర్లో పార్టీ భావజాలంపై స్పష్టత తీసుకురావడం, సంకీర్ణ భాగస్వాములతో చర్చలు ప్రారంభించడం వంటివి చేయనున్నారు. కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉన్నందున ఈ పర్యటనల్లో ప్రతి రాష్ట్రంలోనూ కేవలం 200 మందితో మాత్రమే సమావేశమవనున్నట్లు పేర్కొన్నారు. కాగా… ఇటీవల బీహార్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే.