బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మండిపడ్డారు. ఆమెను ప్రజలు తిరస్కరించే రోజు ఎంతో దూరంలో లేదని అమిత్ షా వ్యాఖ్యానించారు. మంగళవారం కోల్ కతాలో జరిగిన ఘటనతోమమత నిజస్వరూపం ఏంటో బెంగాల్ వాసులకు తెలిసి వచ్చిందన్నారు. నిన్న జరిగిన హింసాత్మక ఘటనలో ఎంతో మంది బీజేపీ కార్యకర్తలకు గాయాలు అయ్యాయని అన్నారు. ఓడిపోతానన్న భయంతోనే మమతా బెనర్జీ తన కార్యకర్తలను రెచ్చగొట్టారని ఆయన ఆరోపించారు. బీజేపీ ర్యాలీలోకి చొరబడిన టీఎంసీ కార్యకర్తలు విధ్వంసానికి పాల్పడ్డారని అన్నారు.
తన రోడ్ షోలో మూడు సార్లు టీఎంసీ దాడులు చేస్తున్నప్పటికీ పోలీసులు కనీసం అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదని అమిత్ షా ఆరోపించారు. తనపైనా రాళ్లదాడి జరిగిందని, అయితే, వ్యక్తిగత సిబ్బంది జాగ్రత్తగా ఉండటంతోనే బయట పడ్డానని అన్నారు. టీఎంసీ కార్యకర్తలు దాడి కోసం ముందుగానే పెట్రోల్ బాంబులను సిద్ధం చేసుకుని వచ్చారని అన్నారు. ఈశ్వరచంద్ర విగ్రహాన్ని ధ్వంసం చేసింది టీఎంసీ కార్యకర్తలేనని అమిత్ షా అన్నారు.