మహారాష్ట్రలో మళ్ళీ ప్రతిష్టంభన లేవనెత్తనుంది బీజేపీ. శివసేన కూటమి ప్రభుత్వ ఏర్పాటు చేస్తామని చెప్పగానే తాము కూడా 119 మంది ఎమ్మెల్యేలతో బీజేపీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ నేత చంద్రకాంత్ పాటిల్ ప్రకటించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీనే అతిపెద్ద పార్టీగా అవతరించిందన్నారు. తమ పార్టీకి 119 మంది ఎమ్మెల్యేల మద్దతుందన్న ఆయన.. మహారాష్ట్రలో బీజేపీనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ప్రభుత్వ ఏర్పాటుపై సంసిద్ధత వ్యక్తం చేశారన్నారు. బీజేపీ లేకుండా మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు కావడం అసాధ్యం అన్నారు. ఇదిలా ఉంటే.. మహారాష్ట్రలో రాష్ట్రపతిపాలన అమలులో ఉంది.
ఇప్పటికే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అంశంపై శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌లు ఓ అవగాహనకు వచ్చినట్లు వార్తలొచ్చాయి. ఈ మూడు పార్టీల నేతలు రేపు గవర్నర్‌ను కలవనున్నారు. రైతుల సమస్యను వివరించడానికే వెళ్తున్నట్లు ఈ పార్టీల నేతలు మీడియాకు వెల్లడించినా.. ప్రభుత్వ ఏర్పాటు గురించి చర్చించేందుకే గవర్నర్‌ను కలుస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే 288 అసెంబ్లీ స్థానాలు ఉన్న మహారాష్ట్రలో.. ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీకైనా 145 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలపాలి. కానీ 119 మంది ఎమ్మెల్యేలతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ బీజేపీ నేత చంద్రకాంత్ పాటిల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి.
గులాబీ జెండా ఎగరడం ఖాయం: మంత్రి గంగుల