telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

లోకనాయకుడు కమల్ హాసన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు

Kamal

త‌మిళ సూప‌ర్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్ నేడు 65వ వసంతంలోకి అడుగుపెట్టిన సంగ‌తి తెలిసిందే. నటుడిగా 60 ఏళ్ల క్రితం ‘కలత్తూర్ కన్నమ్మ’ సినిమాతో నటుడిగా ప్రస్థానాన్ని మొదలుపెట్టారు కమల్ హాసన్. మొద‌టి సినిమాలోనే బాల న‌టుడిగా జాతీయ ఉత్త‌మ న‌టుడి అవార్డు అందుకున్నాడు. బాలనటుడిగా శివాజీగణేశన్, ఎంజీఆర్, జెమినీ గణేషన్ వంటి తమిళ అగ్రనటులతో కలసి పనిచేశాడు. తెలుగులో ‘అంతులేని కథ’,‘మరో చరిత్ర’ సినిమాలతో గుర్తింపు ల‌భించింది. ‘స్వాతి ముత్యం’,‘సాగర సంగమం’,‘ఇంద్రుడు చంద్రుడు’ వంటి సినిమాల్లో మూడు నంది అవార్డులను అందుకున్న ఏకైక పరభాష నటుడిగా కమల్ హాసన్ రికార్డు సాధించాడు. ద‌శావ‌తారం చిత్రంలో ప‌ది పాత్ర‌ల‌లో క‌నిపించి మెప్పించిన క‌మ‌ల్ త‌న‌కి సాటి మ‌రెవ‌రు లేర‌ని నిరూపించాడు. ప్ర‌స్తుతం భార‌తీయుడు 2 చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఆయన ఎన్నో ప్రయోగాత్మక చిత్రాల్లో నటించి మెప్పించారు. అందులో ‘ఇంద్రుడు చంద్రుడు’, ‘విచిత్రసోదరులు’, ‘గుణ’, ‘భామనే సత్యభామనే’, ‘క్షత్రియ పుత్రుడు’, ‘భారతీయుడు, ‘మహానది’, ‘సత్యమే శివం’, ‘తెనాలి’, ‘పంచ తంత్రం’, ‘ద్రోహి’, ‘హేరామ్’, ‘అభయ్’, ‘పోతురాజు’, ’బ్రహ్మచారి’, ‘దశావతారం’, ‘ఈనాడు’… దేనికదే ప్రత్యేకం. ముఖ్యంగా విచిత్రసోదరుల్లో మరుగుజ్జు పాత్ర చేసిన తీరు.. కమల్ కు తప్ప మరొకరికి వీలు కాదు. మైకెల్ మదన కామరాజులో నాలుగు పాత్రలతో మెప్పించాడు.

Kamal

ఇక ఆయన తీరని కోరికగా ‘మరుదనాయగం’ మిగిలే వుంది. ‘మర్మయోగి’గా ప్రేక్షకులు ముందుకు రావాలన్న ఆ ప్రయత్నం ఇంకా కొనసాగుతూనే వుంది. కమల్ హాసన్ కేవలం నటుడిగానే కాకుండా, ప్రొడ్యూసర్, డైరెక్టర్, సింగర్, లిరిక్ రైటర్ గానూ సేవలందించాడు. ఇపుడు ‘మక్కల్ నీది మయ్యమ్’ అనే రాజకీయ పార్టీ అధినాయకుడిగా తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెట్టాడు. కమల్ తన కెరీర్లో.. మొత్తం 170 పైగా అవార్డులు పొందాడు. అందులో 18 ఫిలిం ఫేర్ లున్నాయి. ఉత్తమ బాల నటుడిగా ఒకటి, ఉత్తమ నటుడిగా మూడు జాతీయ అవార్డులు గెలుచుకున్నాడు. ఆసియా ఫిలిం ఫెస్టివల్ బెస్ట్ యాక్టర్ గానూ నిలిచాడు. ఆయన నటించిన ఆరు చిత్రాలను.. ఆస్కార్ అవార్డుకు పంపించారు. భారతదేశంలో మరే నటుడికీ ఈ గౌరవం దక్కక పోవడం గుర్తించాల్సిన విషయం. తమిళనాడు ప్రభుత్వం వారిచే కలైమామణి అవార్డు, గౌరవ డాక్టరేట్‌లు పొందాడు. భారత ప్రభుత్వం 1990లో పద్మశ్రీ ఇచ్చి గౌరవించింది. 2004లో కేంద్రంనుంచి పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. మరోవైపు కమల్ నట వారసులుగా ఆయన కూతుళ్లు శృతి హాసన్, అక్షరా హాసన్‌లు హీరోయిన్లుగా నటించారు. ఇక క‌మ‌ల్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా అభిమానులు, సినీ సెల‌బ్రిటీలు ఆయ‌న‌కి సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌త్యేక జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. ఈ సందర్భంగా “నవ్యా మీడియా తరపున లోకనాయకుడు, లెజెండరీ యాక్టర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు”.

Related posts