telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

టాలీవుడ్ జేజమ్మ అనుష్కకు పుట్టినరోజు శుభాకాంక్షలు

Anushka

నేడు టాలీవుడ్ జేజమ్మ అనుష్క శెట్టి పుట్టినరోజు. 1981లో పుట్టిన ఈ భామ‌ ఈ ఏడాదితో 37 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఏజ్ 35 దాటినా ఇప్పటికీ క్రేజ్ తగ్గని అతికొద్ది హీరోయిన్స్‌లో అనుష్క ఒకరు. ఇంకా అదే ఎనర్జీతో సినిమాలు చేస్తోంది. 2005 నుంచి నేటి వరకు ఏకంగా 14 సంవత్సరాల పాటు సౌత్‌ను ఏలేసిన ఆమె స్టార్ హీరోయిన్‌. దక్షిణాదిలో తెలుగు, తమిళ్‌, మళయాళం, కన్నడ సినిమా రంగాల్లో అందరు స్టార్ హీరోలతో నటించి హిట్లు కొట్టిన ఘనత అనుష్కదే. 2005లో “సూప‌ర్” సినిమాతో ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన ఈ క‌న్న‌డ కస్తూరి ఆ త‌ర్వాత సుమంత్ “మ‌హానంది”లో న‌టించింది. ఈ రెండు సినిమాలు పెద్ద‌గా క్రేజ్ తీసుకురాక‌పోయినా “విక్ర‌మార్కుడు”తో స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇక ఆ త‌ర్వాత 2009లో వ‌చ్చిన “అరుంధ‌తి”తో అనుష్క టాప్ హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత ‘రుద్రమదేవి’ తన రాజసాన్ని ఒలకబోసింది. అప్ప‌టి వ‌ర‌కు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు అంటే ప‌ట్టించుకోని నిర్మాత‌లు ఒక్క‌సారిగా అనుష్క వైపు తిరిగారు. విజ‌యశాంతి త‌ర్వాత తెలుగులో లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌కు మ‌ళ్లీ ఊపు తీసుకొచ్చిన హీరోయిన్ అనుష్కే. “అరుంధ‌తి” లాంటి సినిమా త‌ర్వాత వెంట‌నే “బిల్లా”లో బికినీ వేసిన ఘ‌న‌త అనుష్క ఒక్క‌రికే సొంతం. ఆ త‌ర్వాత “పంచాక్ష‌రి”, “రుద్ర‌మ‌దేవి”, “భాగ‌మ‌తి”, “సైజ్ జీరో” లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసింది అనుష్క‌. మ‌రోవైపు “సింగం” లాంటి సినిమాల్లో హీరోయిన్‌గానూ గ్లామ‌ర్ ఒల‌క‌బోసింది. ఇక రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలితో దేశ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత ‘భాగమతి’గా పలకరించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్నే అందుకుంది. ఆ తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ భామ ఈ యేడాది ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో ‘ఝన్సీ లక్ష్మీబాయి’గా కాసేపు కనిపించి ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ‘నిశ్శబ్ధం’ అనే సినిమా చేస్తోంది. ఈ సినిమాలో అనుష్క చెవిటి, మూగ అయిన బధిర యువతి పాత్రను పోషిస్తోంది. మరో కథానాయిక అంజలి ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోంది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో షాలినీ పాండే, మాధవన్ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. మరి ఈ సినిమాతో హీరోయిన్‌గా అనుష్క శెట్టి మరోసారి సత్తా చాటుతుందా లేదా అనేది చూడాలి. జేజమ్మగా, అరుంధతిగా, దేవసేనగా ప్రేక్షకుల మదిలో స్థానాన్ని సుస్థిరం చేసుకున్న అనుష్కకు అభిమానుల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా ఇంకా ఇలాంటి పుట్టినరోజులెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ “నవ్యా మీడియా” తరపు నుంచి అనుష్కకు పుట్టినరోజు శుభాకాంక్షలు.

Related posts