telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు

Trivikram

ఈరోజు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పుట్టినరోజు. 1971 నవంబర్ 7న భీమవరంలో ఆకెళ్ళ ఉదయ్ భాస్కర్, నరసమ్మ దంపతులకు జన్మించారు.  ఆయన మాటలకూ, చమత్కారాలకూ ప్రేక్షకులు మంత్రముగ్దులవుతారు. చేసింది తక్కువ సినిమాలే అయిన టాలీవుడ్‌ టాప్‌ డైరెక్టర్ గా స్థానం సంపాదించుకున్నారు త్రివిక్రమ్. ఆయన అసలు పేరు ఆకెళ్ల నాగ శ్రీనివాస శర్మ. మొదటిసినిమా నుంచే తన పెన్ పవర్, తన ఫన్ పవర్ చూపించి త్రివిక్రమార్క్ డైలాగ్స్ ఎలా ఉంటాయో అందరికీ హింట్‌ ఇచ్చారు. అక్కడినుంచి త్రివిక్రమ్ మాటల గారడీ మొదలైంది. నువ్వే కావాలి, చిరునవ్వుతో, నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి, మన్మధుడు, జై చిరంజీవ లాంటి సినిమాలలో ఓ రేంజ్ లో పంచ్ లు పేల్చి ప్రేక్షకులను మైమరపించాడు.

జస్ట్ వన్ లైన్ పంచింగ్ తో అందరినీ అలరించటం త్రివిక్రమ్‌ మార్క్‌. అందుకే అతి తక్కువ టైమ్ లో టాలీవుడ్ లో స్టార్ రైటర్ అయ్యారు త్రివిక్రమ్. రైటర్స్ డైరెక్టర్స్ అవ్వడం చాలా కామన్. కథను ఎలా మలుపు తిప్పాలి? కథనానికి ఏ మలుపుదగ్గర మెలికపెట్టాలి? ఇంటర్వెల్ బ్యాంగ్ ఎంత ఎఫెక్టివ్ గా ఉండాలి? హీరోయిజాన్ని ఎంత హైప్ కి తీసుకెళ్ళాలి ఇలాంటి కమర్షియల్‌ ఫార్ములాలన్ని రైటరే ఆలోచిస్తాడు. ఆ ఆలోచనల్ని దర్శకులకు మరింత అందంగా తెర మీద చూపిస్తారు. ఇక రైటరే దర్శకుడు కూడా అయితే… అందుకే త్రివిక్రమ్ అనే రైటర్ డైరెక్టర్ గా సక్సెస్ అయ్యాడు. “నువ్వే నువ్వే” అనే ప్రేమకథకు వినోదం సెంటిమెంట్‌ జోడించి త్రివిక్రమ్ చేసిన ప్రయోగం సూపర్‌ హిట్‌ అయ్యింది. తరువాత `అతడు`తో త్రివిక్రమ్ అంటే అందరికీ ఓ బెంచ్‌ మార్క్‌ ఏర్పడింది. అద్భుతమైన టేకింగ్‌తో, ట్విస్ట్‌లతో మహేష్ బాబులో హై ఓల్టేజ్ హీరోయిజాన్ని చూపించి, హాలీవుడ్ యాక్షన్ సినిమాల రేంజ్‌లో అద్భుతం అనిపించారు త్రివిక్రమ్. హిట్‌ ఫ్లాప్‌ లతో సంబంధం లేకుండా త్రివిక్రమ్‌ భారీ చిత్రాలతో అలరిస్తున్నాడు. మహేష్ బాబుతో రెండు, అల్లు అర్జున్‌తో రెండు, పవన్ తో మూడు సినిమాలు చేసిన త్రివిక్రమ్‌, ప్రస్తుతం అల్లు అర్జున్‌ హీరోగా మూడో సినిమా చేస్తున్నాడు.

Trivikram

మరోసారి తనదైన స్టైల్‌లో “అల వైకుంఠపురము”లో సినిమాను ఫ్యామిలీ ఎమోషనల్‌ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు త్రివిక్రమ్‌. ఇలా టాప్ స్టార్స్ తో సినిమాలు చేస్తున్న మాటల మాంత్రికుడు మనల్ని మరింత కాలం తన మాటలతో, సినిమాలతో అలరించాలని ఆశిస్తూ నెటిజన్లు, సినీ ప్రముఖులు, ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆశిస్తూ “నవ్యా మీడియా తరపున మాటల మాంత్రికుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు”.

Related posts