telugu navyamedia
సామాజిక

ధనవంతుల భద్రత ఖర్చు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. మీరు చూడండి.

Mark Zuckerberg

వేల కోట్ల రూపాయలతో వ్యాపారం.. ఊపిరి తీసుకోవడానికి వీల్లేనంత పని.. వ్యక్తిగత భద్రతకు సమయం దొరక్కపోవడం.. దీంతో ఆ కుబేరులు తమ రక్షణ చూసుకోవడానికి భారీ మొత్తాలను వెచ్చిస్తున్నారు. అయితే, అది భౌతిక భద్రతను మాత్రమే కల్పిస్తుంది. అయినా వారి వ్యక్తిగత భద్రత అంతంత మాత్రమే! ఇంతకీ బిలియనీర్లు తమ వ్యక్తిగత భద్రతకు ఎంత ఖర్చు చేస్తుంటారు? వారికి భద్రత ఏ స్థాయిలో ఉంటుంది?

జీవితంలో ఇంటర్నెట్‌ భాగం అయ్యాక భద్రత గాలిలో దీపంగా మారింది. ల్యాప్‌ట్యాప్‌.. ఐపాడ్‌.. ఇలా ఎక్కడో ఒక చోట ప్రముఖుల భద్రత బలహీనంగా మారుతోంది. దీంతో అవి కొందరి చేతుల్లోకి వెళ్లి.. అవి బలవంతపు వసూళ్లకు ఆధారంగా మారుతుంటాయి. అపర కుబేరుడిగా పేరున్న అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌కు సంబంధించిన అభ్యంతరకర సెల్ఫీ వివాదం ఇటీవల వివాదాస్పందమైంది. అమెరికాకు చెందిన నేషనల్‌ ఎంక్వైరర్‌ అనే పత్రిక తన అభ్యంతరకర చిత్రాన్ని సంపాదించి బ్లాక్‌మెయిల్‌ చేస్తోందని బెజోస్‌ ఒక బ్లాగ్‌లో సంచలన ఆరోపణలు చేశారు. దీంతో ఈ వివాదం బిలియనీర్ల భద్రతా అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది.

సాధారణంగా బిలియనీర్లు వ్యక్తిగత భద్రతకు భారీగానే వెచ్చిస్తారు. విదేశాల్లో అయితే సీక్రెట్‌ సర్వీస్‌ స్థాయిలో ఈ భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. బెజోస్‌ విషయంలో భౌతిక భద్రత, డిజిటల్‌ భద్రతకు మధ్య సమన్వయ లోపం ఉందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఆ పత్రిక బెజోస్‌ వ్యక్తిగత డేటాను ఎలా సంపాదించిందనేది అంతుబట్టని విషయంగా మారింది. బెజోస్‌ కూడా ఈ ‘లీక్‌’పై దృష్టి సారించారు. కారణాలు తెలుసుకోవడానికి ఎంతమొత్తమైనా వెచ్చించాలని తన సెక్యూరిటీ చీఫ్‌ గెవిన్‌ డి బెకర్‌ను ఆదేశించారు.

వ్యక్తిత్వంపై మరకలు..

మనం ఉపయోగించే వస్తువుల రక్షణ ఎక్కడో ఒక చోట బలహీనంగా ఉంటుందని రెడ్‌ఫైవ్‌ సెక్యూరిటీ వ్యవస్థాపకుడు క్రిస్‌ కాల్‌మన్‌ తెలిపారు. బ్యాంకింగ్‌ సమాచారం, వ్యక్తిగత సమాచారం, ఆరోగ్య సమాచారం, ప్రయాణ షెడ్యూల్‌ లాంటివి హ్యాకర్ల దృష్టి ఎక్కువగా ఆకర్షిస్తాయని తెలిపారు. ముఖ్యంగా బిలియనీర్ల సన్నిహితుల నుంచి ఇవి బయటకు పొక్కే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో వీరు డబ్బు పోగొట్టుకోవడమే కాదు.. వారి వ్యక్తిగత ప్రతిష్ఠపై కూడా మరక పడే ప్రమాదం ఉంటుంది. ఇటీవలే టి.డి.ఆమ్రిట్రేడ్‌ హోల్డింగ్స్‌ కార్ప్‌ వ్యవస్థాపకుడు జోయి రికెట్స్‌ వ్యక్తిగత ఈమెయిల్స్‌ను ఒక వెబ్‌సైట్‌ ప్రచురించింది. వీటిలో ఆయన విద్వేషపూరిత వ్యాఖ్యలతో కూడిన ఈమెయిల్స్‌ కూడా ఉన్నాయి. దీంతో జోయి సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

భద్రతకు భారీ మొత్తం..

బిలియనీర్లు భద్రత కోసం భారీగా ఖర్చు చేస్తుంటారు. కమాండోలు, సైనిక అధికారులు, గూఢచార సంస్థల ఉద్యోగులు, మొస్సాద్‌ ఏజెంట్లు, స్వాట్‌ బృందాల సభ్యులు కూడా రిటైర్మెంట్‌ తర్వాత ప్రముఖల భద్రతా సిబ్బందిలో చేరిపోతున్నారు.

* ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌ బర్గ్‌ 2017లో వ్యక్తిగత భద్రత కోసం 7.3 మిలియన్‌ డాలర్లను వెచ్చించారు. మాజీ సీక్రెట్‌ సర్వీసు ఏజెంట్లు ఆయన భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఈ ఏడాది 10 మిలియన్‌ డాలర్లు వెచ్చించనున్నారు. ఈ మొత్తం చాలా దేశాల అధ్యక్షుల కంటే చాలా ఎక్కువ.

* అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ గతేడాది దాదాపు 1.6 మిలియన్‌ డాలర్లను భద్రత కోసం ఖర్చుచేశారు. ఆయన కుటుంబ ఫౌండేషన్‌ కూడా భద్రతపై చాలా మొత్తం ఖర్చు చేసింది.

* భారత్‌కు చెందిన అపర కుబేరుడు ముఖేష్‌ అంబానీ భద్రతకు రూ.20 లక్షలకు పైగా వెచ్చిస్తున్నారు. ఆయనకు జెడ్‌ కేటగిరి భద్రత ఉంది.

* ఆపిల్‌ సీఈవో టిమ్‌కుక్‌ భద్రతకు ఏటా రూ.1.5 కోట్లు ఖర్చవుతున్నాయి.

* ఇన్వెస్ట్‌మెంట్‌ గురూ వారెన్‌ బఫెట్‌ తన భద్రతకు ఏటా రూ.2.60 కోట్లకు పైగా వెచ్చిస్తున్నారు. అంటే రోజుకు దాదాపు రూ.69 వేలు అన్నమాట!!

Related posts