ప్రముఖ వ్యాపారవేత్త, భారత స్టాక్ మార్కెట్ దిగ్గజం రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా మృతి చెందారు. 62 ఏళ్ల వయసున్న ఆయన గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన చికిత్స నిమిత్తం క్యాండీ బ్రీచ్ హాస్పిటల్‌లో చేరారు. వారం రోజుల క్రితం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు
అయితే ఆదివారం ఉదయం 06.45 సమయంలో రాకేశ్ ఝున్‌ఝున్‌వాలాకు గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు హుటాహుటిన ముంబైలోని క్యాండీ బ్రీచ్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆయన చనిపోయారని వైద్యులు నిర్ధారించారు.
హైదరాబాద్‌లోని రాజస్థానీ కుటుంబానికి చెందిన రాకేష్ జూలై 5, 1960న జన్మించారు. వీరి పూర్వీకులది రాజస్థాన్‌లోని ఝున్జునూ, ఝున్‌ఝున్ వాలా తండ్రి ఉద్యోగ రీత్యా ముంబైలో పెరిగారు. అతని తండ్రి ఆదాయపు పన్ను కమిషనర్‌గా ముంబై లో పనిచేశారు.
సిడెన్‌హామ్ కాలేజీ నుంచి డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. అనంతరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియాలో చేరాడు. వాలాకు చిన్న తనం నుంచి వ్యాపారం అంటే మక్కువ.
అందుకే కాలేజీ విద్యార్ధిగా స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు.ఓ వైపు సీఏ(చార్టర్డ్ అకౌంటెంట్) చదువు కుంటూనే స్టాక్ మార్కెట్‌లో మెళుకువలు నేర్చుకున్నారు. అలా 1985లో రూ.5వేల పెట్టుబడి పెట్టి.. తన ప్రయాణాన్ని ప్రారంభించారు . సెప్టెంబర్ 2018 నాటికి అతని ఆస్తి రూ.11వేల కోట్లకు పెరిగింది.ఆయన కొనుగోలు చేసిన షేర్లలో చాలా వరకు కాసుల వర్షం కురిపించాయి. ఆర్ఏఆర్ఈ ఎంటర్ప్రైజెస్ పేరుతో ప్రైవేటు స్టాక్ ట్రేడింగ్ కంపెనీని నడిపించారు.
పెట్టుబడిదారుమాత్రమే కాదు..ఝున్‌ఝున్ వాలా ఆప్‌టెక్ లిమిటెడ్ , హంగామా డిజిటల్ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్‌గా ఉన్నారు. లిమిటెడ్, ప్రైమ్ ఫోకస్ లిమిటెడ్, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్, బిల్‌కేర్ లిమిటెడ్, ప్రజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ప్రోవోగ్ ఇండియా లిమిటెడ్, కాంకర్డ్ బయోటెక్ లిమిటెడ్, ఇన్నోవాసింత్ టెక్నాలజీస్ లిమిటెడ్, మిడ్ డే మల్టీమీడియా లిమిటెడ్, నాగార్జున కాన్‌స్టరుక్షన్ లిమిటెడ్, విసెర్చ్‌లో వంటి అనేక సంస్థలలో డైరెక్టర్‌గా కూడా ఉన్నారు.. ఆయన ఆస్తి విలువ రూ.43.7వేల కోట్లు.
దీంట్లో సింహ భాగం స్టాక్ మార్కెట్ ద్వారానే సంపాదించారు. ‘వారెన్ బఫేట్ ఆఫ్ ఇండియా’ అని కూడా ఝున్‌ఝున్ వాలాను పిలుస్తుంటారు.ఆయనకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు.
ఇటీవలే ఏవియేషన్ రంగంలోకి అడుగుపెట్టిన ఝున్ ఝున్ వాలా ‘ఆకాశ ఎయిర్ లైన్స్’ ను సంస్థను ప్రారంభించారు.
కాగా..రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా మృతి పట్ల భారత ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఆర్థిక ప్రపంచానికి ఆయన చెరగని సహకారాన్ని అందించారంటూ కొనియాడారు. దేశ పురోగతికి కృషి చేశాడన్నారు. ఆయన మృతి బాధాకరమన్నారు. రాకేశ్ కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు మోదీ.
అధికారులు కండువాల్లేని టీఆర్ఎస్ కార్యకర్తలు: జీవన్‌రెడ్డి