telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కాపీ వివాదంలో చిక్కుకున్న విజయ్ “బిగిల్”

Bigil

త‌మిళ స్టార్ హీరో విజ‌య్‌కి కోలీవుడ్‌లోనే కాక వేరే భాష‌లలోను ఎంత క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్కర్లేదు. ఆయ‌న న‌టిస్తున్న 63వ చిత్రం బిగిల్ 2020లో రిలీజ్ కానుంది. ఇప్ప‌టి వ‌ర‌కు చిత్రానికి సంబంధించి విడుద‌లైన పోస్ట‌ర్స్, టీజ‌ర్స్ సినిమాపై భారీ ఆస‌క్తిని పెంచాయి. ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై దాదాపు రూ. 180 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. అట్లీ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. విజ‌య్ – అట్లీ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన తెరీ, మెర్స‌ల్ చిత్రాలు భారీ విజ‌యం సాధించ‌డంతో తాజా ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో తెర‌కెక్కుతున్న బిగిల్ చిత్రంలో న‌య‌న‌తార క‌థానాయిక‌గా న‌టిస్తుంది. బాలీవుడ్ న‌టుడు జాకీ ష్రాఫ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఏఆర్ రెహ‌మాన్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. అది అలా ఉంటే ఈ సినిమా దర్శకుడు అట్లీ తన కథను కాపీ చేశారని తెలుగు షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ నంది చిన్ని కుమార్‌ ఆరోపించారు. తాను స్పోర్ట్ నేపథ్యంలో రాసుకున్న కథలోని ఆత్మతో ‘విజిల్‌’ సినిమా తీశారని అంటున్నారు. తాను ‘స్లమ్‌ సాకర్’ కాన్సెప్ట్‌తో రాసుకున్న ఓ కథను తమిళ డైరెక్టర్ అట్లీ ‘విజిల్‌’ అంటూ సినిమా తీశారని ఆరోపించారు. అంతేకాదు ఈ సినిమాపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని నంది చిన్ని కుమార్.. తెలంగాణ సినిమా రచయితల సంఘాన్ని కోరారు. అందులో భాగంగా ఓ పిటిషన్‌ కూడా ఫైల్ చేశారు. అయితే.. ‘విజిల్‌’ కథ పూర్తిగా తాను రాసుకున్న కథలా లేదని, కానీ నా సినిమాలోని ఆత్మను తీసుకున్నారని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రెండు కథలను పరిశీలించి, త్వరలోనే ఈ వివాదంపై తెలంగాణ సినిమా రచయితల సంఘం చర్యలు తీసుకోనుంది. మరో వైపు అటు తమిళ నాడులో కూడా ‘విజిల్‌’ సినిమాపై దర్శకుడు కేపీ సెల్వ కేసు పెట్టారు. తన కథను కాపీ కొట్టారంటూ మద్రాసు హైకోర్టులో ఆయన పిటిషన్‌ వేశారు. దీంతో అక్టోబరు 25న విడుదలకు సిద్దమవుతున్న ఈ సినిమా వివాదంలో పడింది.

Related posts