telugu navyamedia
సినిమా వార్తలు

భానుమతి భుజం మీద చెయ్యి వెయ్యాలంటే .. ?

తెలుగు సినిమా రంగంలో శ్రీమతి భానుమతి రామకృష్ణ గారికి ఓ ప్రత్యేకమైన శైలి , స్థానం వున్నాయి . నటిగా ,గాయకురాలిగా, సంగీత దర్శకురాలిగా , దర్శకురాలిగా, రచయిత్రిగా , స్టూడియో అథినేతగా ఆమె బహుముఖాలుగా ఎదిగారు. ఆమెలా ఎదిగి ఒదిగిన నటి మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు

పద్మశ్రీ  భానుమతి 1924 సెప్టెంబర్‌ 7న భానుమతి ప్రకాశం జిల్లా అద్దంకి తాలూకా దొడ్డవరం గ్రామంలో జన్మించారు. ఆమె తండ్రి బొమ్మరాజు వెంకట సుబ్బయ్య. చిన్నతనంలోనే రామాయణ, భారతాల్లోని పద్యాలను శ్రావ్యంగా ఆలపించేవారు. అలాగే చిరు ప్రాయంలో ఉండగానే రచనలు చేయడం ఆరంభించింది. ఒక వైపు చదువు మరోవైపు నృత్యంలోనూ ప్రావీణ్యం సంపాందించి అందరినీ అబ్బురపరిచింది . ఆమెలోని ఆసక్తి గమనించి తండ్రి బాగా ప్రోత్సహించాడు .

చిన్నపుడు భానుమతి ఎంతో అందంగా ఉండేది. చదువు, నృత్యం, రచన ఆమెను ఓ ప్రత్యేక మహిళగా నిలబెట్టాయి . భానుమతి ప్రజ్ఞాపాటవాల గురించి విన్న అప్పటి అగ్ర దర్శకుడు సి.పుల్లయ్య “వరవిక్రయం” సినిమాలో అవకాశం ఇచ్చాడు . ఈ సినిమా 1939వ సంవత్సరంలో నిర్మాణమైంది అలా సినిమా రంగంలో అడుగు పెట్టిన భానుమతి అంచెలంచెలుగా ఎదిగారు . తెలుగు , తమిళ సినిమాల్లో నటిస్తూ, పాటలు పాడుతూ తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు .

భానుమతి తెలుగు చిత్ర నిర్మాత, దర్శకుడు పి.యస్. రామకృష్ణారావును ప్రేమించింది . ఆయన కూడా భానుమతి అందానికి , ప్రతిభకు దాసోహం అన్నాడు . వీరి వివాహం 1943, ఆగష్టు 8 న జరిగింది . ఈ దంపతులకు ఓ కుమారుడు జన్మించాడు . అతనికి భరణి అనే పేరు పెట్టారు . కుమారుడు భరణి పేరుతో భరణీ స్టూడియోను నెలకొల్పి బాటసారి , వరుడు కావాలి, చింతామణి , ప్రనారాయణ , చక్రపాణి, చండీరాణి,ప్రేమ, లైలామజ్ను, రత్నమాల సినిమాలను రూపొందించారు .

Bhanumathi Ramakrishna Photos | Veethi

భానుమతి స్వాభిమానం వున్న నటి. సినిమా రంగంలో భానుమతి అంటే అందరికీ హడలే . కొందరు అది అహంకారం అంటారు , మరి కొందరు పొగరు అంటారు. అయినా అలాంటి వాటిని లెక్కచేసేది కాదు . భానుమతి తో నటించాలంటే హీరోలు భయపడేవారట . ఆమె తమకు సీనియర్ అని కాదు . మిగతా నటీమణుల్లా కాదు . ఆమె ఎవరితోనూ చనువుగా ఉండేది కాదు . తన పాత్ర , తను తప్ప మిగతావాటిని పట్టించుకునేది కాదు .

CINEMAYABAZAAR: RAMAKRISHNA: The Man who completes Bhanumati

భానుమతి తో ప్రణయ సన్నీ వేశాల్లో నటించడానికి ఎన్ .టి .రామారావు , అక్కినేని నాగేశ్వర రావు లన్నిటి అగ్ర హీరోలు బిడియపడుతూ ఉండేవారట . భుజం మీద చెయ్యి వెయ్యాలన్నా , కౌగిట్లోకి తీసుకోవాలన్నా సందేహిస్త్తూ ఉండేవారట . దర్శకుడు చెప్పినా అందుకు భానుమతి అంగీకరించాల్చిందే . అదీ భానుమతి ప్రత్యేకత .

Margadarshi Archival - Bhanumathi Ramakrishna - YouTube

ఇక దర్శకురాలిగా , సంగీత దర్శకురాలిగా , గాయనిగా ఆమె ప్రతిభను చాటుకున్నారు . రచయిత్రిగా ” అత్తగారి కథలు “, “నాలో నేను”, “అత్తగారూ, నక్సలైట్లూ”,, “భానుమతి కథానికలు” ఆమె కు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి . తెలుగు సినిమాను శ్వాసించి, శాసించిన మహిళా విదుషీమణి శ్రీమతి భానుమతీ రామకృష్ణ 2005 డిసెంబర్ 24 న తన 79వ ఏట తుది శ్వాస విడిచారు ఆమె ఎప్పటికీ ప్రాతః కాల స్మరణీయురాలే !

 


Related posts