ఇదొక ప్రేమ కథ !
ఒక చక్రవర్తి ప్రేమ కథ.
కుటుంబ పోషణ కోసం దేవాలయాల్లో అనుదినం నర్తించే
అతి సామాన్యురాలి ప్రేమ కథ .
సాహితీ సమరాంగణ సార్వభౌములు
శ్రీకృష్ణదేవరాయల ప్రేమ కథ.
నాట్యమయూరి హరిగంధాపురం వాసి
అందాలరాశి నాగలాదేవి ప్రేమకథ.
అప్పాజీ కాదన్నా ,
మంత్రులు వారించినా ,
దళపతులు వలదన్నా ,
అంతః పుర కాంతలు అభ్యంతరం తెలిపినా ,
రాయలు , నాగలాదేవి మధ్య పల్లవించిన
ప్రేమకు పట్టాభిషేకం ఈ కథ.
అగ్నిసాక్షిగా నాగలాదేవిని శ్రీకృష్ణదేవరాయలు
పరిణయమాడిన కథ.
భగీరథ సీనియర్ జర్నలిస్టు గా అందరికీ సుపరిచితుడు
కవిగా, యాత్రా చరిత్ర రచనా శిల్పిగా మనందరికీ తెలుసు
భగీరథ ఈ గ్రంథ రచనతో మంచి నవలాకారుడయ్యాడు
విస్తుత పరిశోధనతో పాటు విపులాధ్యయనం చేసి రచించిన నవలయిది
శ్రీకృష్ణదేవరాయల తల్లి పేరు నాగాంబ
చిత్తూరు జిల్లాలోని నాగలాపురం అనే గ్రామం
హంపి నగరం సమీపంలో నిర్మించిన నాగలాపురం
ఈ రెండు తన తల్లి నాగాంబ పేరిట రాయలు
నిర్మించారని మనం గతంలో చదువుకున్నాము
కానీ, ఇది నిజం కాదని భగీరథ ప్రామాణికంగా తన పరిశోధన ద్వారా తెల్పుతూ,
తన భార్య నాగలాదేవి పేరు మీద రాయలు నిర్మియించినట్టుగా ఈ నవలలో వెల్లడించాడు.
వివాహానంతరం నాగలాదేవి పేరును రాయలు చిన్నాదేవిగా మార్చాడు
తన పరిపాలనా కాలంలో ఎన్నో దేవాలయాలనుద్దరించిన రాయలు తన హృదయేశ్వరి
నాగలాదేవి పుట్టిన ఊరు నాగలాపురంలోని వేదనారాయణ స్వామి ఆలయాన్ని విస్తృత పరిచాడు
తన ప్రేమ అజరామరంగా వుండాలని , నాగలాదేవిపేరు చిరస్థాయిగా ఈ భూమి మీద నిలవాలని శ్రీకృష్ణదేవరాయలు చేసిన ప్రయత్నమిది.
రాయల రాజనీతి చరిత్ర గురించి,
పరమత సహనం గురించి,
జైత్రయాత్ర గురించి ,
భువనవిజయం గురించి ఎన్నో పుస్తకాలు వెలువడ్డాయి.
కానీ , రాయలు, నాగలాదేవి మధ్య జరిగిన ప్రేమ, పరిణయం,
నాగాలాదేవియే చిన్నాదేవియని,
చిన్నాదేవికే రాయలు ప్రాధాన్యత ఇచ్చాడని, ఎవ్వరూ ఇంతవరకూ వెలుగులోకి తేలేదు .
ఈ విషయంలో చారిత్రక వివరాలు కూడా చాలామందికి తెలియదు .
కానీ , భగీరథ తన పరిశోధన ద్వారా తాను తెలుసుకున్న వాస్తవాలను
దేశ చరిత్రలోని కొంగ్రొత్త కోణాలను ప్రపంచానికి తెలియ పరచాలనే సదుద్దేశ్యంతో,
కాల్పనికతతో పాటు చారిత్రిక సంఘటనలతో సమాంతరంగా నడిచే ప్రేమ కథగా ‘నాగలాదేవి ‘ నవలను వెలువరిస్తున్నాడు.
శ్రీకృష్ణదేవరాయలు సమర్ధుడైన పాలకుడే కాదు ,
మన జాతి గర్వించే ప్రేమికుడు కూడా.
ఈ నాగలాదేవి నవలలో భగీరథ రచనాశైలి, శిల్పం, అనల్పం, అసాధారణం.
భగీరథ చేయి తిరిగిన నవలా రచయితగా రూపొంది, మున్ముందు కాలంలో మరెన్నో చారిత్రిక విశేషాలతో కూడుకున్న నవలల్ని వెలుగులోకి తేవాలని, స్ఫూర్తిమంతమైన అంశాలతో అల్లుకొన్న నవలల్ని తెలుగు జాతికి అందించాలని ఆశిస్తున్నాను.
-డాక్టర్ కె .వి. రమణాచారి
తెలంగాణ ప్రభుత్వ సలహాదారు .
వల్లభనేని వంశీ వర్సెస్ టీడీపీ.. పెరుగుతున్న మాటల యుద్దం!