telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

ఈ శతాబ్దపు గొప్ప నవల భగీరథ ‘నాగలాదేవి’

సీనియర్ జర్నలిస్ట్ , కవి, రచయిత , పరిశోధకుడు భగీరథ రాసిన ‘నాగలాదేవి’ నవల ఈ శతాబ్దపు గొప్ప ప్రేమ కావ్యమని పలువురు వక్తలు కొనియాడారు .

భారతీయ సాహిత్య అనువాద ఫౌండేషన్, రఘు అరికపూడి సేవా ట్రస్ట్ సంయుక్తంగా భగీరథ రచించిన ‘నాగలాదేవి’ నవలపై సమీక్షా సమాలోచన చిక్కడపల్లి కళాభారతి లో జరిగింది .

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన విశ్రాంత ఇన్ కమ్ టాక్స్ చీఫ్ కమీషనర్ ఎమ్ . నరసింహప్ప మాట్లాడుతూ .. శ్రీకృష్ణదేవరాయల నిర్మల ప్రేమకు పట్టం కట్టిన నవల , నాగలాదేవి వ్యక్తిత్వానికి అద్దం పట్టిన నవల, ఈ శతాబ్దపు ఉత్తమ నవల నాగలాదేవి అని చెప్పారు .

రచయిత భగీరథ అవిశ్రాంతంగా పరిశోధన చేసి చరిత్రలో ఓ కొత్త కోణాన్ని ఆవిష్కరించారని నరసింహప్ప తెలిపారు .

సభకు అధ్యక్షత వహించిన బిక్కి కృష్ణ మాట్లాడుతూ … సీనియర్ జర్నలిస్టు భగీరథ ఇప్పటికే 16 పుస్తకాలు రాశారు , ఈ నాగలాదేవి నవల ఉత్త మొత్తంగా , ఉదాత్తంగా ఉంది , నిజం చెప్పాలంటే చారిత్రిక నవలల్లో అత్యున్నత మైనదని చెప్పారు.

శ్రీకృష్ణదేవరాయలు, నాగలాదేవి ప్రణయ కథను అపూర్వంగా , అనితర సాధ్యంగా మలిచారని కృష్ణ కొనియాడారు.

నాగలాదేవి నవలలో చారిత్రిక అంశాల గురించి కవి డాక్టర్ నాళేశ్వరం శంకరం మాట్లాడుతూ .. నాగలాదేవి నవల ఒక మహా కావ్యంగా ఉందని , ఉత్కంఠగా చదివించే లక్షణం ఉందని చెప్పారు.

చరిత్రలో నాగలాదేవి గురించిన సమాచారం చాలా తక్కువ అని , అయితే భగీరథ పరిశోధించి ఒక సమగ్రమైన ప్రేమ కథగా మలిచారని శంకరం ప్రశంసించారు.

డాక్టర్ బీరం సుందర్రావు భాషా శైలి సౌందర్యం గురించి మాట్లాడుతూ .. నాగలాదేవి నవల అంతా సరళమైన భాషలో సాగుతుందని , చదవడం మొదలు పెడితే చివరివరకు ఏక బిగిన సాగుతుందని , నవల అంతా కవిత్వంతో పరిమళిస్తుందని , నాగలాదేవి చరిత్ర చదివిన తరువాత మనసు ఆర్ద్రమవుతుందని చెప్పారు . నాగలాదేవి నవలలో భగీరథ శైలి విభిన్నమైనది ఆయన ప్రశంసించారు.

పాత్ర చిత్రణపై డాక్టర్ జ్యోత్న ప్రభ మాట్లాడుతూ .. నాగలాదేవి చదివిన తరువాత ఇందులో పాత్రలను అద్భుతంగా సృష్టిచారనిపించింది , నాగలాదేవి , శ్రీకృష్ణదేవరాయలే కాదు చిన్న పాత్రలకు కూడా ప్రాధాన్యత నివ్వడం నన్ను బాగా ఆకట్టుకుంది , రచయిత ఈ చారిత్రక నవలను అమోఘమైన కావ్యంగా మలిచారని చెప్పవచ్చు. నేను చదివిన చారిత్రిక నవలల్లో అత్యున్నతమైనదని ఆమె అన్నారు .

సామజిక సందేశం పై జెల్ది విద్యాధర్ మాట్లాడుతూ .. నాగలాదేవి నవలే ఓ గొప్ప ప్రేమ సందేశం. నిజమైన ప్రేమకు , నిఖార్సైన అనుబంధానికి నాగలాదేవి , శ్రీకృష్ణదేవరాయలే నిదర్శనం , నవల చదివిన తరువాత ఓ గొప్ప అనుభూతి మనసులో మిగిలి పోతుందని , ఈ శతాబ్దపు గొప్ప చారిత్రిక నవల నాగలాదేవి , రచయిత భగీరథ గారిని అభినందిస్తున్నాను అని చెప్ప్పారు .

భగీరథ మాట్లాడుతూ .. ఇదే చిక్కడపల్లిలో 1980 జూన్ 1వ తేదీన నా మొదటి కవితా సంపుటి ‘మానవత’ కు మహాకవి శ్రీ శ్రీ ముందుమాట వ్రాసి , స్వయంగా ఆవిష్కరించారు. 44 సంవత్సరాల తరువాత ఇదే చిక్కడపల్లిలో నా పుస్తకం ‘నాగలాదేవి’ సమీక్షలో వక్తలు ‘ఈ శతాబ్దపు అత్యున్నత చారిత్రిక నవల అని ప్రశంసించడం నేను మర్చిపోలేను , ఈ నాగలాదేవి నన్ను వెంటాడి రాయించుకుందేమో అనిపిస్తుంది , 15 సంవత్సరాల పరిశోధన తరువాత నాగలాదేవి నవల వ్రాశానని భగీరథ తెలిపారు. రచయిత భగీరథను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు

Related posts