telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

వైఎస్ మాట తప్పని, మడమ తిప్పని నాయకుడు: భగీరథ

డాక్టర్ వై.ఎస్ .రాజశేఖర రెడ్డి గారు మరణించి 12 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ తెలుగు ప్రజలు ఆయన ప్రవేశపెట్టిన పథకాలను, ఆయన స్మృతులను మర్చిపోలేదు. రాశేఖర రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని తెలిపే ఓ అరుదైన సంఘటన తెలియజేస్తాను.

2004 అక్టోబర్ 11 వ తేదీ సాయంత్రం 6.30 గంటల సమయం. హైదరాబాద్‌లోని ఫిలింనగర్ దైవసన్నిధానం. అన్ని దేవతామూర్తులను అపురూపంగా అలంకరించారు. అప్పటికే సినిమా ప్రముఖులు, భక్తులతో కళకళలాడుతోంది. దేవాలయం చైర్మన్ నిర్మాత వి.బి. రాజేంద్ర ప్రసాద్, కార్యదర్శి నటుడు, నిర్మాత మాగంటి మురళి మోహన్ అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నారు. దేవాలయం ప్రధాన ద్వారం దగ్గర సన్నాయి మేళం సిద్ధంగా వుంది. ప్రధాన పూజారి,ఇతర పూజారులు ముఖ్య అతిథికి పూర్ణ కుంభంతో స్వాగతం చెప్పడానికి సిద్ధంగా వున్నారు.

 

ఆ వచ్చే అతిధిని కలసి శుభాకాంక్షలు చెప్పడానికి పద్మభూషణ్ అక్కినేని నాగేశ్వర రావు, నిర్మాత పద్మశ్రీ డి.వి .ఎస్ రాజు, మూవీ మొఘల్ డి. రామానాయుడు, నిర్మాత అల్లు అరవింద్, సహజకవి ఎమ్మెస్ రెడ్డి, టి.సుబ్బరామి రెడ్డి , తమ్మారెడ్డి భరద్వాజ, డాక్టర్ కె.ఎల్ నారాయణ, ఏడిద నాగేశ్వర రావు తదితర ప్రముఖులు అతిధి కోసం చూస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్ చాలా అటూ ఇటూ తిరుగుతూ వున్నారు. ప్రతి ఐదు నిముషాలకు ఒకసారి నన్ను పిలిచి “సర్ బయలు దేరారా ?” అని అడుగుతున్నారు .

అయితే అప్పటికీ నాకు ఆ అతిథి రాక పోవచ్చునని సమాచారం వచ్చింది. ఈ సమయంలో రాజేంద్ర ప్రసాద్ గారికి ఈ విషయం ఎలా చెప్పాలి? అని ఆలోచిస్తున్నాను. ఆరోజు దేవాలయ సందర్శనకు వస్తానని కార్యక్రమాన్ని ఖరారు చేసింది సాక్షాత్తు ముఖమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 14వ ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు మే 14, 2004న పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. అప్పట్లో ముఖ్యమంత్రి కార్యాలయం రాజభవన్ రోడ్ లో వున్న లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో ఉండేది. సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ గా డాక్టర్ కె.వి.రమణాచారి గారు ఉండేవారు, 3 నెలల తరువాత రమణాచారి గారితో మాట్లాడి రాజశేఖర రెడ్డి గారిని కలవడానికి అపాయింట్‌మెంట్ తీసుకున్నాము. సెప్టెంబర్ చివరి వారంలో ఓరోజు రాజేంద్ర ప్రసాద్ గారిని తీసుకొని ఉదయం 10.30 గంటలకు లేక్ వ్యూ గెస్ట్ హౌస్‌కు వెళ్ళాను.

రాజశేఖర రెడ్డి గారికి పుష్పగుచ్చం ఇచ్చి కంగ్రాట్యులేషన్స్ చెప్పాము. రాజేంద్ర ప్రసాద్ గారితో రాజశేఖర రెడ్డి గారు ఎంతో ఆత్మీయంగా మాట్లాడారు. “ప్రసాద్ గారు మీ సినిమాల్లో పాటలంటే నాకు ఎంతో ఇష్టం” అని చెప్పారు . రాజేంద్ర ప్రసాద్ గారు దేవాలయం గురించి వివరించి దానికి సంబంధించిన బ్రోచర్ చూపించి ” మీరు మా దైవ సన్నిధానమును సందర్శించాలి” అన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఆలోచించకుండా “రమణా, ఒకరోజు సాయంత్రం ఫిక్స్ చేసి చెప్పండి, ప్రసాద్ గారు దేవాలయానికి వెడదాం” అన్నారు. ప్రక్కనే వున్న నా భుజంమీద చేయి వేసి” బ్రదర్ రమణతో టచ్ లో వుండు” అన్నారు.

ఒక వారం తరువాత రమణాచారి గారు నాకు ఫోన్ చేసి” ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు దేవాలయానికి అక్టోబర్ 11 సాయంత్రం 7.00 నుంచి 7.30 మధ్యలో వస్తారు. ముఖ్యమంత్రి రావడానికి ఒక గంట ముందు అందరినీ రమ్మని చెప్పండి” అన్నారు. ఈ విషయం రాజేంద్ర ప్రసాద్ గారికి తెలిపాను. ఆయన చాలా సంతోషించి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి కార్యక్రమం ఖరారు అయ్యిందని మిగతా కమిటీ సభ్యులకు, సినిమా ప్రముఖులకు చెప్పారు. అప్పటి నుంచి రాజేంద్ర ప్రసాద్ గారు ఏర్పాట్లు ఎలా ఉండాలి?
ముఖ్యమంత్రిని ఎలా ఆహ్వానించాలి? అని రోజూ రిహార్సల్ వేసేవారు.

ఆ రోజు రానే వచ్చింది. సినిమా ప్రముఖులు అందరూ వచ్చారు. ఏర్పాట్లు కూడా చాలా ఘనంగా జరిగాయి . అయితే ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు రాకపోవచ్చునని రమణాచారి గారు నాకు ఫోన్ చేసి చెప్పారు. ఈ విషయం రాజేంద్ర ప్రసాద్ గారికి ఎలా చెప్పాలి ? ఆయన ఎలా రియాక్ట్ అవుతారు? నా మనస్సు మొద్దుబారిపోయింది. అప్పటికి సమయం 7.15 నిముషాలు అవుతుంది. ముఖ్యమంత్రి కార్యాలయం లేదా రమణాచారి గారి నుంచి ఫోన్ రాలేదు అంటే రాజశేఖర రెడ్డి గారు వచ్చే అవకాశం లేదు. కారణం ఆరోజు ముఖ్యమంత్రి గారితో నక్సలైట్ నాయకులు శాంతి చర్చలు జరుపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ఎలా వస్తారు ? ఇక లాభం లేదనుకొని రాజేంద్ర ప్రసాద్ గారితో చెబుదామని ఆయన గదిలోకి వెడుతున్నాను . సరిగా అదే సమయంలో రమణాచారి గారి ఫోన్.. ఇదే వార్త మళ్ళీ చెప్పడానికి చేసి వుంటాడనుకున్నా, అయినా మాట్లాడదాం అనుకుని “హలో” అంటున్నా, “భగీరథా, ముఖ్యమంత్రి గారు ఇప్పుడే దేవాలయానికి బయలుదేరారు” అని చెప్పారు.

ఆ క్షణంలో నా సంతోషానికి అవధులు లేవు. ఈవిషయం రాజేంద్ర ప్రసాద్ గారికి చెప్పి “స్వాగత చెప్పడానికి క్రిందకు వెడదాం రండి ” అన్నాను. ఆయన అందరినీ అప్రమత్తం చేసి క్రిందకు వచ్చారు. అప్పటికే బంజారా హిల్స్, జూబిలీహిల్స్ పోలీస్ వాహనాల సైరన్లు మోగుతున్నాయి. సన్నాయి మేళం ఒకవైపు, పూర్ణ కుంభంతో పూజారులు మరోవైపు, మధ్యలో సినిమా ప్రముఖులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు సరిగా 7.45 నిముషాలకు దేవాలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టారు. 25 నిముషాలు మాత్రమే దేవాలయంలో వున్నారు. ఆరోజు ఎలాంటి ప్రత్యేక కార్యక్రమాన్ని ముఖ్యమంత్రితో చేయించలేదు. రాజశేఖర రెడ్డి గారు రాజేంద్ర ప్రసాద్ గారి అభిమానంతో దేవాలయ సందర్శనకు వచ్చారు.
అదీ రాజశేఖర రెడ్డి గారి అసమాన వ్యక్తిత్వం. నక్సలైట్ నాయకులతో అరగంట బ్రేక్ అని చెప్పి దేవాలయానికి
బయలుదేరారని రమణాచారి గారు తరువాత నాతో చెప్పారు రాజశేఖర రెడ్డి గారు మాట తప్పరు, మడమ తిప్పరు అని ఇప్పటికైనా ఒప్పుకుంటారా? -భగీరథ

Related posts