నీ చెలిమే నాకు బలిమి

27

నీ మెడలో నా వలపు హారం వేసి
నీ తలమీద నా కీర్తి కిరీటం అలంకరించి
నీ నుదుట నాదృష్టి బొట్టు పెట్టి
నీ కళ్లల్లో నా హృదయం
ఉదయిస్తున్నప్పుడు
కాలం పీఠాన్ని అధిష్టించి
నీ ధ్యానం ప్రారంభిస్తాను
నా మనోనేత్రానికి నువ్వు
అనూహ్యమైన తేజస్సుతో
సృష్టికర్త కళ్లలో పుట్టిన
తొలి కిరణంగా కనిపిస్తావు

నీ నవ్వు నాకు శక్తి
నీ నవ్వు నాకు రక్తి
నీ నవ్వు నాకు ముక్తి
నీ నిర్ధేశం నా పథం
నీ ఆదేశం నా జీవితం
నీ కోసమే ఈ జీవనం
జీవం పురుడుపోసుకున్న నాటినుంచి
నా దృష్టికి ఎన్నివేల తరాలను చూపావు

ఎన్ని రూపాల్లో కనిపించావు
ఎంత చిత్రంగా నా వైపు చూస్తావు
నువ్వు ఎంత నాగరికతను
మేలి ముసుగుగా ధరించినా
నీ అసలు రూపం
నాలో ముద్రించుకుపోయింది
నీ చెలిమే నాకు బలిమి
నా ప్రేమే నీకు కలిమి
భగీరథ
(అక్షరాంజలి కావ్యం నుంచి )