telugu navyamedia
రాజకీయ

ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్‌ ధన్‌ఖడ్‌..

ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగ్ దీప్ ధన్ కర్ పేరును బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసింది. ప్రసుత్తం పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌గా ఉన్న జగ్ దీప్‌ ధన్‌ ఖర్ పేరును బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా శనివారం ప్రకటించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీలో విస్తృత సంప్రదింపుల అనంతరం ధన్‌ఖడ్‌ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు.

ఉపరాష్ట్రపతి అభ్యర్థి పేరును జేపీ నడ్డా విలేకరుల సమావేశంలో ప్రకటించారు. అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకుని జగ్ దీప్‌ పేరును ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఖరారు చేసినట్లు తెలిపారు.

ధన్‌ఖడ్‌ అచ్ఛమైన రైతు బిడ్డ అని ప్రశంసించారు. ప్రజల గవర్నర్‌గా పేరు సంపాదించారని చెప్పారు. మూడు దశాబ్దాలకు పైగా ప్రజా జీవితంలో కొనసాగుతున్నారని గుర్తుచేశారు.

జగదీప్‌ 1951 మే 18న రాజస్థాన్‌లోని ఝంఝనూ జిల్లా కితానా గ్రామంలో.. వెనుకబడిన జాట్‌ వర్గానికి చెందిన గోకుల్‌చంద్‌, కేసరి దేవి దంపతులకు జన్మించారు. ధన్‌ఖర్ చిత్తోర్‌గఢ్‌లోని సైనిక్ స్కూల్ లో పాఠశాల విద్యను పూర్తి చేశారు.

ఫిజిక్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆయన రాజస్థాన్ విశ్వవిద్యాలయం నుంచి LLB చదివారు. యూనివర్సిటీ ఆఫ్‌ రాజస్థాన్‌ నుంచి న్యాయవాద పట్టా పుచ్చుకుని, రాజస్థాన్‌ హైకోర్టులో న్యాయవాదిగా.. సీనియర్‌ న్యాయవాదిగా పనిచేశారు. 1989 లోక్‌సభ ఎన్నికల్లో ఝంఝనూ నుంచి ఎంపీగా గెలుపొందారు.

1990లో కేంద్రమంత్రిగా పనిచేశారు. 1993-98 మధ్య అజ్మీర్‌ జిల్లాలోని కిషన్‌గడ్‌ నుంచి ఎమ్మెల్యేగా రాజస్థాన్‌ అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించారు. 2019 నుంచి పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌గా కొనసాగుతున్నారు. మమత సర్కారుపై నేరుగా విమర్శలు చేసి పలుమార్లు వార్తల్లో నిలిచారు.

ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పదవీకాలం ఆగష్టు 10వ తేదీతో ముగుస్తుండ‌డంతో నామినేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం అయింది.

షెడ్యూల్‌ ప్రకారం ఆగష్టు 6న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగాలి. జులై 19వ తేదీ వరకు నామినేషన్ దాఖలు చేసిందుకు చివరి తేదీ. ఒకటి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉంటే, ఉపరాష్ట్రపతి పదవికి ఆగస్టు 6న ఎన్నికలు నిర్వహించి, అదే రోజు ఫలితాలు కూడా ప్రకటిస్తారు.

కాగా.. ఎన్డీయే అభ్యర్థిగా అనూహ్యంగా జగదీప్‌ ధన్‌ఖడ్‌ పేరును బీజేపీ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. హరియాణా, రాజస్తాన్, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో కీలక సామజికవర్గమైన జాట్ల మద్దతు కూడగట్టడానికి ఆయనను ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా వ్యవసాయదారులైన జాట్లు కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహంగా ఉన్నారు. కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించారు.

Related posts