చైనాలో కరోనా సెకండ్ సైకిల్ ప్రారంభమైంది. వైరస్ వ్యాప్తి రాజధానిలో తీవ్రంగా ఉందని బీజింగ్ అధికార ప్రతినిధి క్సూ హిజియన్ వెల్లడించారు. బీజింగ్ లోని ప్రధాన ఎయిర్ పోర్టుల్లో 1,255 విమాన సర్వీసులను అధికారులు రద్దు చేశారని అధికార పత్రిక ‘పీపుల్స్ డైలీ’ వెల్లడించింది. , ఓ హోల్ సేల్ ఫుడ్ మార్కెట్ నుంచి వైరస్ వ్యాపిస్తోందని న అధికారులు గుర్తించారు. ఆ ప్రాంతాన్ని కంటెయిన్మెంట్ చేయడానికి పరుగులు పెట్టారు. బుధవారం నాడు నగరంలో 31 కొత్త కేసులు నమోదయ్యాయి. బీజింగ్ పౌరులు నగరాన్ని విడిచి వెళ్లరాదన్న ఆదేశాలు జారీ అయ్యాయి.
క్సిన్ ఫాడీ హోల్ సేల్ ఫుడ్ మార్కెట్ వైరస్ క్లస్టర్ తో వేల కొద్దీ ప్రజలకు సంబంధముందని గుర్తించిన అధికారులు, 30 రెడిడెన్షియల్ కాంపౌండ్లలో లాక్ డౌన్ విధించారు. మీడియం లేదా హై రిస్క్ ఉన్న ప్రాంతాల ప్రజలను ఎటూ కదలనీయకుండా ఆంక్షలను అమలు చేస్తున్నారు. ఎవరైనా బీజింగ్ వదిలి వెళ్లాలనుకుంటే, న్యూక్లిక్ యాసిడ్ పరీక్షను తప్పనిసరి చేశారు. బీజింగ్ నుంచి ఇతర ప్రాంతాలకు ఎవరైనా వెళితే, వారిని క్వారంటైన్ చేస్తున్నారు. ఇటీవల తెరచుకున్న పాఠశాలలను తక్షణమే మూసివేసి, ఆన్ లైన్ ద్వారా క్లాసులు చెప్పుకోవాలని అధికారులు ఆదేశించారు.