ఐపీఎల్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఆటగాళ్లు వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్‌లకు కరోనా సోకింది. దీంతో సోమవారం రాత్రి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వాయిదా పడింది. దీన్ని టోర్నీ పూర్తయ్యేలోపు మళ్లీ నిర్వహిస్తారని తెలిసింది. అయితే అదెప్పుడనేది ప్రస్తుతానికి తెలియరాలేదు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదాన సిబ్బంది ఐదు మందికి తాజాగా కరోనా సోకిందని నిర్ధారణ అయింది. ప్రస్తుతం వారంతా ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథన్, బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ, ఆ ఫ్రాంఛైజీకి చెందిన బస్సు క్లీనర్‌కు సైతం కరోనా సోకిందనే వార్తలు వచ్చాయి. అయితే అందులో ఎలాంటి నిజం లేదని బీసీసీఐ అధికారి ఒకరు స్పష్టం చేశారు. ఆదివారం చెన్నై సిబ్బందికి వచ్చిన ఫలితాలు తప్పుడు రిపోర్టులని, సోమవారం వచ్చిన ఫలితాల్లో నెగిటివ్‌గా నిర్ధారణ అయిందని పేర్కొన్నారు. దాంతో చెన్నై జట్టులో ప్రస్తుతం ఎవరూ వైరస్ బారిన పడలేదని స్పష్టం అయింది.
previous post