telugu navyamedia
క్రీడలు వార్తలు

మహిళా క్రికెటర్లపై బీసీసీఐ తక్కువ చూపు… మరో నిదర్శనం…!

గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత మహిళల జట్టు రన్నరప్‌గా నిలిచిన విషయం తెలిసిందే. తృటిలో టైటిల్ చేజార్చుకున్న హర్మన్ సేన రన్నరప్‌గా ఐదు లక్షల డాలర్ల ప్రైజ్‌మనీని సొంతం చేసుకుంది. అయితే 14 నెలలు పూర్తయినా… ఆ రన్నరప్‌ ప్రైజ్‌మనీ ఇప్పటికీ భారత మహిళా క్రికెటర్ల చేతికందనేలేదు. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) రన్నరప్‌ ప్రైజ్‌మనీ మొత్తం 5 లక్షల డాలర్లను (రూ. 3 కోట్ల 64 లక్షలు) భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి గతేడాది ఏప్రిల్‌లోనే అందజేసినప్పటికీ బోర్డు మాత్రం అమ్మాయిలకు ఆ మొత్తాన్ని ఇప్పటిదాకా ఇవ్వలేదు. మహిళా క్రికెటర్లపై బోర్డు తక్కువ చూపునకు ఇదో నిదర్శనమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏదైనా ఐసీసీ టోర్నమెంట్‌ ముగిసిన ఏడు రోజుల్లోనే ఐసీసీ ప్రైజ్‌మనీ నిధుల్ని ఆయా దేశాల బోర్డులకు పంపిస్తుంది. అయితే సంబంధిత దేశాల బోర్డులే తమ జట్లకు పంపిణీ చేయాలి. నిధులందిన రెండు వారాల్లోపే అమ్మాయిలకు పంపిణీ చేయాల్సి ఉన్నా బీసీసీఐ మాత్రం ఖజానాలోనే అట్టిపెట్టుకుంది. క్రికెట్‌ ఆస్ట్రేలియా తమ జట్టుకు గతేడాది ఏప్రిల్‌లో… ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు తమ జట్టుకు గత సంవత్సరం మేలోనే ప్రైజ్‌మనీని అందజేశాయి. అయితే ఈ విమర్శలపై బీసీసీఐ స్పందించింది. ఇంతవరకు అమ్మాయిలకు ప్రైజ్‌మనీ మొత్తాన్ని పంపిణీ చేయకపోవడం నిజమేనని అంగీకరించిన బోర్డు వారం రోజుల్లో దానిని మహిళా క్రికెటర్లకు ఇస్తామని తెలిపింది.

Related posts