ఐపీఎల్ 2021 కోసం ఈ నెల 18న చెన్నైలో భారత క్రికెట్ మండలి (బీసీసీఐ) మినీ వేలంను నిర్వహించనుంది. వేలంను పురస్కరించుకొని బీసీసీఐ కొత్త నిబంధను తీసుకొచ్చింది. ఇదే ఇప్పుడు కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కి శాపంలా మారింది. ప్రతి జట్టు ఆటగాళ్ల కొనుగోలుకు సంబంధించి మొత్తం కేటాయించిన దాంట్లో (ప్రతీ జట్టుకు రూ.85కోట్లు) 75 శాతం ఖర్చు చేయాలని,లేని పక్షంలో మిగిలిన డబ్బులు బీసీసీఐ ఖాతాలోకి జమకానున్నాయి. అసలు విషయంలోకి వెళితే… జనవరి 20తో ఆటగాళ్ల రిటెన్షన్ గడువు, ఫిబ్రవరి 4తో ప్లేయర్ల ట్రేడింగ్ విండో ముగిసింది. కింగ్స్ పంజాబ్ జట్టు 16 మందిని రిటైన్ చేసుకొని మిగిలిన వారిని రిలీజ్ చేసింది. వీరిలో గత ఐపీఎల్‌లో నిరాశపరిచిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ సహా షెల్డన్ కాట్రెల్, కృష్ణప్ప గౌతమ్, ముజీబ్ ఉర్ రెహమాన్, జేమ్స్ నీషమ్, హార్డస్ విల్‌జెన్‌లో పాటు కరుణ్ నాయర్, సుచిత్, తేజిందర్ సింగ్ దిల్లాన్ తదితరులు ఉన్నారు. దీంతో ఈసారి ఐపీఎల్ వేలంలో పాల్గొననున్న ఫ్రాంచైజీల్లో కింగ్స్ పంజాబ్ వద్ద అత్యధికంగా రూ. 53.2 కోట్లు ఉన్నాయి.
ఐపీఎల్‌లోని ఎనిమిది ఫ్రాంఛైజీలు గరిష్ఠంగా రూ.85 కోట్లని వేలంలో ఖర్చు చేసుకోవచ్చు. అయితే ఏ ఫ్రాంఛైజీ కూడా తన వద్ద ఉన్న మొత్తంను గత కొన్ని సీజన్లుగా పూర్తిగా ఖర్చు చేయడం లేదు. కొన్ని ఫ్రాంఛైజీల వద్ద ఒక్కోసారి రూ.10-15 కోట్లు అలానే మిగిలిపోతోంది. దాంతో ఐపీఎల్ 2021 సీజన్‌కి ప్రతి ఫ్రాంఛైజీ కనీసం 75% శాతం మనీని వేలంలో ఖర్చు చేయాలని బీసీసీఐ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. బీసీసీఐ తాజా నిబంధన అత్యధిక డబ్బుతో వేలంలోకి వెళ్తున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కి షాక్ ఇచ్చింది.పంజాబ్ తన వద్ద ప్రస్తుతం ఉన్న రూ.53.2 కోట్లలో కనీసం 31.7 కోట్లు వేలంలోకి ఖర్చు చేయాల్సి ఉంది. బీసీసీఐ వెల్లడించిన కొత్త నిబంధనల ప్రకారం రిటైన్ చేసుకున్న 16 మంది ఆటగాళ్లకు కింగ్స్ పంజాబ్ రూ. 31.8 కోట్లు చెల్లించగా.. ఇప్పుడు వారి వద్ద 53.2 కోట్లు ఉన్నాయి. ఆటగాళ్ల వేలానికి మిగిలి ఉన్న మొత్తంలో 75 శాతం ఖర్చు చేయాలని బీసీసీఐ తెలిపిన నేపథ్యంలో 53.2 కోట్లలో 75 శాతం అంటే 31.7 కోట్లను ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ నిర్ణయించిన కనీస మొత్తాన్ని పంజాబ్ ఖర్చు చేయడంలో విఫలమైతే.. మిగిలిన డబ్బు బీసీసీఐ ఖాతాలోకి వెళుతుంది. ఇది పంజాబ్‌కు నష్టం కలిగించే విషయమనే చెప్పాలి.