telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

సీఏఏ పై .. విమర్శిస్తున్న బంగ్లా ప్రధాని షేక్‌ హసీనా..

bangladesh pm shaik hasina on CAA

భారత ప్రభుత్వ పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై బంగ్లాదేశ్‌ ప్రధాన మంత్రి షేక్‌ హసీనా స్పందించారు. దాని అవసరం ఏమీ లేదని అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ, ఇది భారత దేశ అంతర్గత వ్యవహారమని వ్యాఖ్యానించారు. దుబాయ్‌లో ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌరుల పట్టిక (ఎన్ఆర్‌సీ) అనేవి భారత దేశ అంతర్గత వ్యవహారాలని పేర్కొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఎన్ఆర్‌సీ కేవలం భారత దేశ అంతర్గత వ్యవహారమని తనకు చెప్పారన్నారు. 2019 అక్టోబరులో తాను ఢిల్లీకి వెళ్లినపుడు తనకు మోదీ వ్యక్తిగతంగా హామీ ఇచ్చారన్నారు. భారత్‌, బంగ్లాదేశ్‌ సంబంధాలు బలంగా ఉన్నాయని పేర్కొన్నారు.

మరోవైపు మతపరమైన పీడన కారణంగా బంగ్లాదేశ్‌ నుంచి భారత్‌కు ఎవరూ వలస పోలేదని ఆ దేశం స్పష్టం చేసింది. మతపరమైన పీడన కారణంగా బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌, అఫ్గానిస్తాన్‌ దేశాల నుంచి వసల వచ్చిన ముస్లిమేతరులకు పౌరసత్వం కల్పించేందుకు భారత ప్రభుత్వం సీఏఏను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. కొన్ని రాష్ట్రాలు సీఏఏను అమలు చేయబోమని ప్రకటించాయి.

Related posts