telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

2019 ప్రపంచ కప్ : .. మొత్తానికి ఆశించిన ఆట చూడగలిగిన ప్రేక్షకులు.. బంగ్లా సంచలన విజయం..

bangladesh drastic won in 2019 world cup match

ప్రపంచకప్‌లో సంచలనం నమోదైంది. పటిష్టమైన దక్షిణాఫ్రికా జట్టుపై బంగ్లాదేశ్ సంచలన విజయం సాధించింది. తొలుత భారీ స్కోరు చేసిన బంగ్లాదేశ్ ఆ పై సఫారీలను ముప్పుతిప్పలు పెట్టి విజయాన్ని అందుకుంది. లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 330 పరుగులు చేసింది. వన్డేల్లో బంగ్లాదేశ్‌కు ఇదే అత్యధికం. గతంలో పాక్ పై 329 పరుగులు చేసింది. ఓపెనర్లు తమీమ్ ఇక్బాల్-సౌమ్య సర్కార్‌లు పద్ధతిగా ఆడుతూ స్కోరుబోర్డును ముందుకు కదిలించారు. అనవసర షాట్లకు పోకుండా జాగ్రత్త పడ్డారు. ఈ క్రమంలో తొలి వికెట్‌కు 60 పరుగులు జోడించిన తర్వాత 16 పరుగులు చేసిన తమీమ్ పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన షకీబల్ హసన్ (75), ముష్ఫికర్ రహీం (78) చెలరేగి ఆడారు. బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టారు. వారిద్దరూ అవుటయ్యాక పరుగులు రావడం కొంత నెమ్మదించినప్పటికీ రన్‌రేట్ పడిపోకుండా జాగ్రత్త పడ్డారు. మొహ్మదుల్లా మిథున్ 21, మహ్ముదుల్లా 46(నాటౌట్), హొసైన్ 26 పరుగులు చేశారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో బంగ్లాదేశ్ 6 వికెట్ల నష్టానికి 330 పరుగులు చేసి సఫారీల ముందు భారీ విజయ లక్ష్యాన్ని ఉంచింది.

దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 309 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఓపెనర్లు క్వింటన్ డికాక్ (23), మార్క్‌రమ్ (45)లు మంచి ఆరంభాన్నే ఇచ్చినప్పటికీ దానిని తుది వరకు నిలుపుకోవడంలో బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. చివరి వరకు దక్షిణాఫ్రికాకు గెలుపుపై ఆశలు ఉన్నప్పటికీ వికెట్లు పడిపోవడం ఆ జట్టుకు శాపంగా మారింది. కెప్టెన్ డుప్లెసిస్ (62), డేవిడ్ మిల్లర్(38), డుసెన్ (41), డుమినీ (45) లు దూకుడుగా ఆడడంతో విజయం దక్షిణాఫ్రికా వైపే మొగ్గింది. అయితే, డుమినీ అవుటయ్యాక మ్యాచ్ బంగ్లాదేశ్ చేతిలోకి వెళ్లిపోయింది. చివర్లో సౌతాఫ్రికా వరుస పెట్టి వికెట్లు కోల్పోవడంతో ఓటమి ఖాయమైంది. 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 309 పరుగుల వద్దే ఆగిపోయి 21 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఓటమి పాలైంది. ప్రపంచకప్‌లో సఫారీలకు ఇది వరుసగా రెండో ఓటమి కాగా, బంగ్లాదేశ్‌కు ఇది తొలి విజయం. మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించిన బంగ్లా ఆటగాడు షకీబల్ హసన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.

Related posts