telugu navyamedia
తెలంగాణ వార్తలు

ప్రారంభ‌మైన బండి సంజ‌య్ “ప్రజా సంగ్రామ యాత్ర”

*ప్రారంభ‌మైన బండి సంజ‌య్ “ప్రజా సంగ్రామ యాత్ర”
*పామునూరు నుంచి ప్రారంభ‌మైన బండి పాద‌యాత్ర
*బండి సంజ‌య్ పాద‌యాత్ర‌కు భారీ బందోబ‌స్తు

హైకోర్టు అనుమ‌తి ల‌భించ‌డంతో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజ‌య్‌ “ప్రజా సంగ్రామ యాత్ర” ప్రారంభ‌మైంది. పోలీసులు ఎక్కడైతే ఆయన్ను అదుపులోకి తీసుకున్నారో.. అక్కడి నుంచే భారీ బందోబ‌స్తు మ‌ధ్య యాత్రను ప్రారంభించారు. 

పామునూరు దగ్గర నుంచి ప్రారంభమైన పాదయాత్ర.. ఉప్పుగల్, కూనూరు, గర్మేపల్లి మీదుగా.. నాగాపురం వరకు బండి సంజయ్ పాదయాత్ర కొనసాగనుంది. రేపు భద్రకాళీ ఆలయం వరకు కొనసాగుతోంది. 

అనంతరం పాదయాత్ర ముగింపు సభ ఉంటుంది. హన్మకొండ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో బహిరంగ సభ  నిర్వహణకు  ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ సభ నిర్వహణకు అనుమతి నిరాకరించారు. పోలీసుల నుంచి ఎలాంటి సమాచారం లేనందున అనుమతి రద్దు చేస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు. దీనిపై కూడా బీజేపీ నాయకులు కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.

ఢిల్లీ లిక్కర్ స్కాం విషయమై హైద్రాబాద్ లో బీజేపీ శ్రేణులు ఆందోళనలు చేశారు.ఈ ఆందోళనల్లో పాల్గొన్న బీజేపీ శ్రేణులపై పోలీసులు హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. ఈ కేసులను నిరసిస్తూ ఈ నెల 23న పాదయాత్ర శిబిరం వద్దే బండి సంజయ్ దీక్షకు ప్రయత్నించడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ నుండి బండి సంజయ్ ను అరెస్ట్ చేసి కరీంనగర్ కు తరలించారు.

వరంగల్ జిల్లాలో చోటు చేసుకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రజా సంగ్రామ యాత్రను రద్దు చేసుకోవాలని వర్ధన్నపేట ఏసీపీ బండి సంజయ్ కు ఈ నెల 23న లేఖను ఇచ్చారు.ఈ లేఖపై బీజేపీ నేతలు అదే రోజున హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై నిన్న హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వర్ధన్నపేట ఏసీసీ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు సస్పెండ్ చేయ‌డంతో ప్రజా సంగ్రామ యాత్రకు లైన్ క్లియర్ అయింది.

 

Related posts