బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్ సవాల్ విసిరారు. నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభిస్తున్న సందర్భంగా కుత్బుల్లాపూర్‌లో బీజేపీ బహిరంగ సభలో సంజయ్ మాట్లాడారు.
వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టకపోతే కరెంట్ కట్ చేసేలా కేంద్రం విద్యుత్ బిల్లును రూపొందించిందంటూ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
ఎక్కడివో పాత పేపర్లను, చిత్తు కాగితాలను పట్టుకుని అసెంబ్లీని కేసీఆర్ తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీలో కేసీఆర్ చెప్పిందంతా అబద్దమని నిరూపించేందుకు తాము సిద్ధమని ప్రకటించారు.
బీజేపీ పేరుతో మోటార్లకు మీటర్లు పెట్టేందుకు, కరెంట్ ఛార్జీల పేరుతో రాష్ట్ర ప్రజలపై మరో రూ.4 వేల కోట్ల భారం మోపేందుకు కేసీఆర్ కుట్రకు తెరదీశారని ఆరోపించారు
కేంద్రం చేసిన బిల్లును కేసీఆర్‌కు పంపిస్తానని, మోటారుకు మీటర్ పెట్టాలని బిల్లులో ఉంటే నేను రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. లేదంటే కేసీఆర్ రాజీనామా చేయాలని బండి సంజయ్ సవాల్ విసిరారు.
పేదలకు డబుల్ బెడ్‌రూమ్‌లు ఇస్తానని, ఇప్పటి వరకు ఇవ్వలేదని, రైతుల రుణమాఫీ చేయాలని ప్రశ్నిస్తే బీజేపీని మతతత్వ పార్టీ అంటున్నారని కేసీఆర్‌పై సంజయ్ ధ్వజమెత్తారు. రాష్టర్ సమస్యలను గాలికి వదిలేసి దేశాన్ని పట్టుకుని తిరుగుతున్నారని, కేసీఆర్ బీఆర్‌ఎస్ కాదు.. పీఆర్‌ఎస్ పెట్టుకుని కేఏ పాల్‌తో కలిసి తిరిగినా ఒరిగేదేమి లేదన్నారు.
బీజేపీ పేరుతో మోటార్లకు మీటర్లు పెడితే ప్రగతి భవన్ గడీలు బద్దలు కొట్టి తీరుతామని హెచ్చరించారు. ఆర్టీసీ విషయంలోనూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. 99 ఏళ్ల లీజు పేరుతో విలువైన ఆర్టీసీ డిపోలు, ఆర్టీసీ స్థలాలను కేసీఆర్ తన అనుచరులకు కట్టబెట్టేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఆర్టీసీని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటుపరం చేయనీయబోమన్నారు.