telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

కరీంనగర్ పోలీస్ కమిషరేట్ లో పోలీస్ అమరవీరుల స్మారకస్థూపానికి బండి సంజయ్ నివాళు…

పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా కరీంనగర్ పోలీస్ కమిషరేట్ లో పోలీస్ అమరవీరుల స్మారక స్థూపానికి నేడు నివాళులర్పించాను. 1959 చైనా దురాక్రమణను భారత సైన్యం సమర్థంగా తిప్పిగొట్టిన రోజు ఇది. ఈ సమరంలో ఎంతోమంది సైనికులు అమరులయ్యారు. ఆ రోజును పురస్కరించుకుంటూ…. విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్‌ యోధుల త్యాగాలను స్మరించుకోవాలి. ఎండ, వాన, పగలు, రాత్రి అనే తేడా లేకుండా కుటుంబంతో కలిసి జరుపుకునే పండగల్ని త్యజించి… ప్రజల కోసం జీవించి, మరణించే పోలీసుల త్యాగానికి సానుభూతి, గౌరవం చూపించడం మనందరి బాధ్యత. పోలీసులుగా బాధ్యత నిర్వర్తించడానికి ముందుకు రాబోతున్న వారికి విధి నిర్వహణలో నూతనోత్తేజాన్ని, స్ఫూర్తిని నింపడమే పోలీసు అమర వీరుల సంస్మరణ దినం జరుపుకోవడంలోని ప్రధాన ఉద్దేశం. పోలీస్ టోపీ మీద ఉన్న మూడు సింహాలు దేశ సార్వభౌమాధికారానికి నిదర్శనం. ప్రపంచమంతా నిద్రపోయినా మేల్కొని ఉండేది పోలీసులే. ప్రజల కోసం ప్రాణాలర్పించిన పోలీస్‌ అమరవీరులకు నివాళులర్పించడం వారికిచ్చే అసలైన గౌరవం. ప్రజలు హాయిగా జీవితం గడుపుతున్నారంటే… అందుకు కారణం పోలీస్‌ శాఖే. సమాజంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడటంలో ఎందరో పోలీసులు అమరవీరులవ్వడం బాధాకరం. కరోనా సమయంలోనూ పోలీసులు ముందుండి పోరాడారు. కరోనా సోకకుండా జాగ్రత్తలు పాటిస్తూ… తమ విధులు నిర్వహిస్తూనే చాలామంది పోలీసులు కరోనా బారినపడి మరణించడం దురదృష్టకరం. పోలీస్ అమరవీరుల సేవలు, వారి త్యాగాలు అజరామరం.ప్రజాసేవలో తరిస్తూ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటాము.

Related posts