telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్

Bandi sanjay bjp

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ను నియమిస్తూ ఆ పార్టీ హైకామాండ్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బండి సంజయ్ ఎంపికను బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఖరారు చేసినట్టుగా పార్టీ జాతీయ కార్యదర్శి అరుణ్ సింగ్ ప్రకటన విడుదల చేశారు. వాస్తవానికి ఇప్పటివరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కె.లక్ష్మణ్ నే మరోసారి కొనసాగిస్తారని భావించారు. కానీ బీజేపీ అధిష్టానం బండి సంజయ్ వైపు మొగ్గు చూపి ఎంపిక చేసింది.

కాపు సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్ ఆర్ఎస్ఎస్, ఏబీవీపీల్లో పనిచేశారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో పలుమార్లు కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు. కరీంనగర్ నుంచే రెండు సార్లు అసెంబ్లీ ఎలక్షన్లలో పోటీ చేసి ఓడిపోయారు. అయితే రెండు సార్లూ గట్టి పోటీ ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకత్వం గత లోక్ సభ ఎలక్షన్లలో ఆయనకు కరీంనగర్ లోక్ సభ టికెట్ ఇచ్చింది. అక్కడి నుంచి గతంలో ఎంపీగా గెలిచిన కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్, తాజామాజీ ఎంపీ, సీఎం కేసీఆర్ బంధువు వినోద్ టీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగారు. అయినా బండి సంజయ్ టీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ పై ఏకంగా 90 వేల ఓట్లకుపైగా మెజారిటీతో విజయం సాధించారు.

Related posts