telugu navyamedia
సామాజిక

ఆరు ఆటంబాంబులతో కాపురం ..

1975 లో హైదరాబాదుకు వచ్చినప్పుడు కొత్త కాపురం ఇబ్బందులు ఎలా ఉంటాయో ఏమిటో తెలియకుండా, అశోక్ నగర్ చమన్ దగ్గర మా రెండో అన్నయ్య రామచంద్రరావు గారింట్లో కొన్నాళ్ళు కాలక్షేపం చేశాము. తర్వాత వాళ్ళ పక్కనే ఉన్న ఇంట్లో చిన్న వాటా దొరికితే అక్కడకు మారాము. ఇల్లుగలవాళ్ళు ఆ ఇంటిని ఎవరికో అమ్మివేయడంతో వాళ్ళకీ, మాకూ ఆ ఇంటితో రుణం తీరిపోయింది. మళ్ళీ ఇల్లు వెతుక్కోవాల్సిన పరిస్థితి. సరే! ఎక్కువ వెతుకులాట, ప్రయాస లేకుండానే చిక్కడపల్లి త్యాగరాయ గానసభ సమీపంలో ఒక పోర్షన్ దొరికింది. మాస్కో వెళ్ళే దాకా అక్కడే మా మకాం. ఆ ఇంటి వాస్తు మహిమ ఏమోకానీ ఎప్పుడూ నలుగురు వచ్చేపోయేవాళ్ళతో కళకళలాడుతూ వుండేది.

పగలల్లా మా ఆవిడ నడిపే అమ్మవొడి, సాయంత్రం అయ్యేసరికి రచయితలు, కవులు, ఉన్నతాధికారులతో కూడిన ఆస్థానంగా మారిపోయేది. ఆఫీసునుంచి నా రాకతో నిమిత్తం లేకుండా జనం జమ అయ్యేవారు. వాళ్లకు, కాఫీలు, ఉప్మాలు, కొండొకచో అర్ధరాత్రి భోజనాలతో మా ఆవిడ నిర్మల అన్నీ అమర్చిపెట్టేది. ఇవన్నీ చూసి రేడియోలో నా సహచరులు, న్యూస్ రీడర్, ప్రముఖ రచయిత డి. వెంకట్రామయ్య గారు, “వండ నలయదు వేవురు వచ్చిరేని నన్నపూర్ణకు నుద్దియౌ నతనిగృహిణి” అనేవారు, మనుచరిత్రలో అల్లసాని పెద్దన గారి పద్యాన్ని ఉటంకిస్తూ. అనడమే కాదు తన జీవిత చరిత్ర గ్రంథంలో పేర్కొన్నారు కూడా.

ఇదలా ఉంచుదాం..

‘పొయ్యి పైనా, పొయ్యి లోపలా’ వున్నవాడే కలవాడు అనేది మా బామ్మగారు. అంటే నలుగురికి సమృద్ధిగా వండి పెట్టే సరుకులు, పొయ్యి వెలిగించడానికి ఎండు కట్టెలు ఎల్లప్పుడూ ఇంట్లో వుండాలి అనేది ఆవిడగారి మన్ కి బాత్. ఆ రోజుల్లో లాగా కట్టెల బాధ ఇప్పుడు లేదు. వచ్చిన బాధల్లా గ్యాస్ సిలిండర్ ఖాళీ అయితేనే. సింగిల్ సిలిండర్ సిస్టం కావడం వల్ల గ్యాస్ అయిపోతే ప్రత్యామ్నాయం వుండేది కాదు.

ఆ కాలంలో సామాన్య గృహస్తుకు డబ్బుతో పాటు బాగా కటకటగా ఉండేవి మరో మూడు. కరెంటు, నల్లా నీళ్ళు, గ్యాస్ సిలిండరు. ఇంట్లో నిత్యం జరిగే సంతర్పణలు, సమారాధనలు, సంభారాల భారంతో నిమిత్తం పెట్టుకోకుండా అవన్నీ అంతా మా ఆవిడ భుజాల మీదకు వదిలేసి, కొరతలుగా ఉన్న ఈ మూడింటి సంగతి చూడడానికి, అధికార దుర్వినియోగం ఆనండి, ఏదైనా అనండి ఎంతదూరం అయినా వెళ్ళేవాడిని. నీళ్ళు రాని రోజున ఏకంగా మంచినీళ్ళ మంత్రి, ఆయన్ని అలానే పిలిచేవాడిని, మునిసిపల్ శాఖ మంత్రి, బండారు సత్యనారాయణ మూర్తిగారికి పొద్దున్నే ఫోన్ కొట్టేవాడిని. ఆయన విసుక్కోకుండా ‘ట్యాంకర్ కావాలి కదా పంపిస్తాను అనేవారు. అన్నట్టే అరగంటలో మంచి నీళ్ళ ట్యాంకర్ వచ్చి సంపులో నీళ్ళు నింపి పోయేది మా ఇరుగు పొరుగుకు కూడా సరిపోయేలా. అలాగే కరెంటు. పోవడం ఆలస్యం, విద్యుత్ బోర్డుచైర్మన్ నార్ల తాతారావు గారెకి ఫోన్. ఆయన నా బాధ పడలేక మా ఇంటి దగ్గరలోనే ఓ ట్రాన్స్ ఫార్మర్ వేయించారు. పొతే మూడోది మరీ ముఖ్యమైనది గ్యాస్ సిలిండర్. ఖాళీ అయిందని మా ఆవిడ ఫోన్ చేసి చెప్పడం ఆలస్యం అన్ని పనులు వదిలిపెట్టి ఆ పనిమీదనే కూర్చొనే వాడిని.

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో తెలిసిన జనరల్ మేనేజర్లకు ఫోన్ చేసేవాడిని. అరగంటలో సిలిండర్ డెలివరీ అయిన సంగతి తెలిసిన తర్వాతనే ఆఫీసు పనయినా ఏదైనా. నా బాధ ప్రపంచం బాధ అన్నట్టు సాగేది నా వ్యవహారం. అదేమిటో ఆ రోజుల్లో ఒక సిలిండర్ ఇరవై రోజులు కూడా వచ్చేది కాదు. ఇప్పుడు రెండు నెలలు వస్తోంది. ఈ ఖర్చులు అయితే తగ్గాయి. కానీ మరో రూపంలో పెరిగాయి. పక్షి పిల్లలు రెక్కలు వచ్చి ఎగిరి పోయిన తర్వాత గూడు విశాలమైనట్టు ఇప్పుడు ఇళ్లు కూడా ఖాళీగా, విశాలంగా కనిపిస్తున్నాయి.

ఆ తర్వాత అయిదేళ్లు ఇలాంటి ఏ కొరతలు లేని సోవియట్ యూనియన్ లో కాలుమీద కాలేసుకుని దర్జాగా బతికాము. దేనికీ కొరతలేదు, చివరాఖరుకి డబ్బుకు కూడా. పైగా గ్యాసు, కరెంటు, ఫోను, మూడు పడక గదుల ఇల్లు ఉచితం. దాంతో వారానికి రెండు మార్లు, వారాంతపు రోజుల్లో మాస్కోలోని తెలుగు విద్యార్ధులతో, తెలుగు కుటుంబాలతో మా ఇల్లు నిత్య కల్యాణం పచ్చ తోరణం.

ఇక అయిదేళ్ళ ప్రవాస జీవితం తర్వాత తిరిగి వస్తే, హైదరాబాదు ఎయిర్ పోర్టులోనే నాటి కమ్యూనికేషన్ల మంత్రి రంగయ్య నాయుడు గారు కలిసి ఫోన్ లేకపోతె ఎల్లా అంటూ ఆయనే చొరవ తీసుకుని ఫోన్ కనెక్షన్ మంజూరు చేశారు. డిపార్ట్ మెంటు వాళ్ళు మర్నాడు ఫోను, లాంగ్ కార్డు పట్టుకుని రేడియో స్టేషన్ కు వచ్చారు, ఇల్లెక్కడ అడ్రసు చెప్పండని అంటూ. అప్పటికి రెంటుకు ఇల్లే దొరకలేదు. మా పెద్దన్నయ్య పర్వతాలరావుగారింట్లో ఉంటున్నాము.

इंदौर में आज गैस सिलेंडर के दाम और सब्सिडी | Gas Cylinder Price Subsidy  Check Indore mp

 

ఆకస్మికంగా వచ్చి పడ్డ ఫోన్ కోసం ఇంటి వేట ముమ్మరం చేశాము. చివరికి పంజాగుట్టలోని మా అన్నయ్య ఇంటికి దగ్గరలోనే దుర్గానగర్ కాలనీలో ఓ ఇల్లు దొరికింది. ఓడలో మాస్కో సామాను వచ్చేలోగా దగ్గరలో ఉన్న మరో పెద్ద ఇంటికి మారాము. అద్దె రెండు వేలు. లంకంత కొంప. ఇంటివాళ్ళు ముస్లిమ్స్. ఎక్కడో ఏదో దేశంలో వుంటారు. ఆ ఇల్లు కట్టిన తాపీ మేస్త్రీకి చిన్న చిన్న గదులు కట్టడం తెలియదల్లె వుంది. అన్నీపెద్ద పెద్ద హాల్సే. ఇల్లంతా కట్టిన తర్వాత చూసుకుంటే వంటిల్లు కనబడనట్టుంది. ఏదో చిన్న జాగా చూసి వంట గది అనిపించాడు. ఆ ఇంట్లో మా మాస్కో సామాను భేషుగ్గా సరిపోయింది కానీ సిలిండర్లకు ఆ చిన్న కిచెన్ లో జాగా దొరకలేదు. దాంతో వున్న ఆరు సిలిండర్లలో ఒకటి స్టవ్ కు బిగించి, మిగిలిన అయిదింటినీ బయట హాల్లో దసరా బొమ్మల కొలువులా వరసగా పెట్టేవాళ్ళం.

ఆరు సిలిండర్లు కధ ఏమిటంటారా!

నేను మాస్కోనుంచి వచ్చిన తర్వాత కొద్ది రోజులకే అప్పటి పెట్రోలియం మంత్రి చింతా మోహన్ గారు ఓ రెండు, ఎంపీలు డాక్టర్ మల్లు రవి, రాయపాటి సాంబశివరావు గార్లు చెరి రెండు సిలిండర్లు నోరు తెరిచి అడగకుండానే తమ కోటాలో ఇప్పించారు. దాంతో ఆరు సిలిండర్లు గృహ ప్రవేశం చేసాయి. నట్టింట్లో బాంబులు పెట్టుకుని శ్రీనివాసరావు మళ్ళీ కొత్త కాపురం మొదలు పెట్టాడని ఫ్రెండ్స్ సరదాగా అనేవారు. అయితే మా ఆవిడ పబ్లిక్ రిలేషన్స్ కు అవి బాగా ఉపయోగపడ్డాయి. ఎవరికి ఎప్పుడు సిలిండర్ అవసరమైనా వాళ్ళు గ్యాస్ కంపెనీకి కాకుండా మా ఆవిడకు ఫోన్ చేసేవాళ్ళు. అలా కొన్నాల్లాకి ఎవరికి ఇచ్చామో తెలియని పరిస్థితుల్లో చివరికి మా ఇంట్లో అయిదే మిగిలాయి.

ఈలోగా రూల్స్ మారి ఒక పేరు మీద ఒకే కనెక్షన్ అన్నారు. శాపవిమోచనం అయిన గంధర్వుల మాదిరిగా ఓ మూడు సిలిండర్లు రెక్కలు కట్టుకుని తమ దేవలోకానికి తరలి పోయాయి. ఆచూకీ దొరక్కుండా పోయిన సిలిండర్ డబ్బు మా చేత కట్టించుకున్నారు. అలా ఆరు సిలిండర్ల కధ కంచికి చేరింది.
ఇక ఇప్పుడు దేనికీ కొరత లేదు, ఒక్క మా ఆవిడ లేదనే చింత తప్ప. అనుభవించే దశలో దాటిపోయింది.

– భండారు శ్రీనివాస రావు

Related posts