telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

బాలకృష్ణ చిన్నల్లుడికి.. విశాఖ లోక్ సభ స్థానం .. !

balakrishna son in law from visakha loksabha

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో రోజురోజుకు ఆయా పార్టీల సమీకరణాలు మారిపోతున్నాయి. ఈ మేరకు ప్రధాన పార్టీలు వైసీపీ-టీడీపీలు తీవ్రంగా పోటీ పడుతుండటం విశేషం. ఆశావహులను పక్కన పెట్టి, ఎవరు గెలుస్తారో వారికే టికెట్ ఇచ్చే ఫార్ములానే ఇరు పార్టీలు అనుసరిస్తున్నాయి. ఇక కుటుంబ రాజకీయాలు కూడా ఈ సందర్భంగా ప్రధాన ఆశావాహులుగా పరిగణించక తప్పని పరిస్థితి. లేదంటే వ్యతిరేకత ఇంటి నుండే మొదలవుతుందని ఇరు పార్టీ అధినేతలు బెంబేలెత్తుతున్నారు. దీనితో గెలుపు శాతానికి వాళ్ళు తూట్లు పొడుస్తున్నారని తెలిసినా, కుటుంబ అనుకూల నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే, తనకు అవకాశం ఇస్తే పోటీకి సిద్ధం అని మొదటి నుండి చెప్పుకొస్తున్న బాలకృష్ణ చిన్నల్లుడు మొత్తానికి అనుకున్నది సాధించినట్టే ఉన్నాడు.

నేడు రెండు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో 14 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. అయితే, లోక్‌సభకు కూడా అభ్యర్థులను ప్రకటిస్తారా? లేదా? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. ఇక, అత్యంత కీలకమైన విశాఖ లోక్‌సభ స్థానం నుంచి దివంగత ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి మనవడు, బాలకృష్ణ చిన్నల్లుడు, మంత్రి నారా లోకేశ్‌కు తోడల్లుడు అయిన శ్రీభరత్ పోటీ చేసే అవకాశం ఉందన్న వార్త ఇప్పుడు సంచలనమైంది.

మూర్తి పార్టీకి చేసిన సేవను దృష్టిలో పెట్టుకుని శ్రీభరత్‌కు అవకాశం ఇవ్వాలని పార్టీ నాయకుల్లో కొందరు అధిష్ఠానాన్ని పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నగరంలోనే ఉన్న శ్రీభరత్ ఇప్పటికే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయననే బరిలోకి దించాలని, తద్వారా గెలుపు నల్లేరుమీద నడకేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Related posts