నట సింహం నందమూరి బాలకృష్ణ 105వ చిత్రం రెగ్యులర్ షూటింగ్ థాయ్‌లాండ్‌లో ఇటీవలే ప్రారంభమైంది. హ్యాపీ మూవీస్ బ్యానర్‌పై సి.కళ్యాణ్ నిర్మాతగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోంది. సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. భూమిక చావ్లా, ప్రకాశ్ రాజ్, జయసుధ ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్నారు. ఇటీవల థాయ్‌లాండ్‌లో ఈ సినిమా తొలి షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తయ్యింది. చిత్ర నటీనటులందరూ పాల్గొనగా… 20 రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్‌లో రెండు పాటలు, కొంత టాకీపార్ట్, భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను షూట్ చేశారు. “జైసింహా” వంటి సూపర్‌హిట్ చిత్రం తర్వాత బాలకృష్ణ, సి.కల్యాణ్ కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చిరంతన్ భట్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి రామ్‌ప్రసాద్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. పరుచూరి మురళి కథను అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో బాలయ్య లుక్ ఇదేనంటూ ఓ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో బాలకృష్ణ ఇది వరకు ఎప్పుడూ కనిపించని విధంగా కనపడుతున్నారు. యంగ్ లుక్‌లో, ఫ్రెంచ్ గడ్డంతో ఉన్న బాలయ్యను చూసిన నందమూరి అభిమానులు థ్రిల్ అవుతున్నారు.