telugu navyamedia
తెలంగాణ వార్తలు

అజాదీ కా అమృతోత్సవ్‌ : టీఎస్‌ఆర్టీసీ ఆగస్టు15 ఆఫర్లు ఇవే

75వ స్వాతంత్ర్య వేడుకలను పురస్కరించుకుని తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు బంపర్ ఆఫర్లుతో ముందుకు వచ్చింది. అజాదీ కా అమృతోత్సవ్ లో భాగంగా ఈ నెల పదో తేదీ నుంచి 21వ తేదీ వరకు 12 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు, ఆఫర్లల‌ను ప్రయాణికులకు అందించేందుకు ముందుకు వచ్చింది.

ఇందులో భాగంగా ఆగస్టు 15వ తేదీన పుట్టిన చిన్నారులందరికీ వారికి 12 ఏళ్లు పూర్తి అయ్యేంత వరకు రాష్ట్రంలోని అన్ని సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది.

అదేవిధంగా ఈనెల‌ ఆగస్టు 15 నాటికి ఎవరైతే 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పెద్ద వారు ఉంటారో వారందరు ఆ రోజున ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ మేరకు తెలంగాణ ఆర్టీసీ వెల్లడించింది. అంతేకాకుండా, టీ-24 బస్‌ టికెట్ ను ఆ రోజున రూ.75 రూపాయలకే అమ్మనున్నారు.

మామూలు రోజుల్లో అయితే, ఈ రకం టికెట్ ధర రూ.120 ఉంటుంది. ఆగస్టు 15 సందర్భంగా తాము నిర్ణయించిన ఆఫర్లను ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ , మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్‌ సోమవారం సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 10వ తేదీ నుంచి 21వ తేదీ వరకు 12 రోజుల పాటు తెలంగాణ ఆర్టీసీ తరపున వేర్వేరు కార్యక్రమాలను నిర్వహించనున్నట్లుగా వెల్లడించారు.

ఇక నేటి నుంచి అంటే ఆగస్టు 9 నుంచి తెలంగాణ ఆర్టీసీకి చెందిన అన్ని ప్రాంతాల్లో ప్రతి రోజూ ఉదయం 11 గంటలకు జాతీయ గీతాన్ని ఆలపించనున్నారు. ఆగస్టు 13 నుంచి 15వ తేదీ వరకు అన్ని బస్సులకు జాతీయ జెండాను (ఏర్పాటు చేయనున్నారు. ఉద్యోగులంతా అమృతోత్సవ్‌ బ్యాడ్జీలతోనే విధులకు హాజరు కావాలని తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం నిర్దేశించింది.

ప్రయాణికులకు ఇండిపెండెన్స్‌డే స్పెష‌ల్ ఆప‌ర్లు ఇవే

*టీటీడీ ప్యాకేజీని వినియోగించుకునే ప్రయాణికులకు ఈ నెల 16 నుంచి 21 వరకు రూ.75 తగ్గింపు.
*ఆగస్టు 15న కార్గోలో ఒక కిలో పార్సిల్‌ 75 కిలో మీటర్ల వరకు ఉచిత రవాణా.
*టాప్‌-75 ప్రయాణికులకు ఒక ట్రిప్‌ టికెట్‌ ఉచితం.
*శంషాబాద్‌ విమానాశ్రయానికి ఆగస్టు 15న పుష్పక్‌ ఎయిర్‌ పోర్ట్‌ సర్వీసును వినియోగించుకునే ప్రయాణికులు 75 శాతం ఛార్జీ చెల్లిస్తే సరిపోతుంది
*75 సంవత్సరాలు దాటిన సీనియర్‌ సిటిజన్లకు తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రిలో ఆగస్టు 15 నుంచి 22 వరకు ఉచిత వైద్య పరీక్షలు .
*అలాగే 75 ఏళ్లలోపు వారికి రూ.750లతో వైద్య పరీక్షల ప్యాకేజీ అమలు చేస్తారు.

Related posts