telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

2019 ప్రపంచ కప్ : .. ఇరగదీసిన ఆస్ట్రేలియా ..

australia won on afghanistan in 2019 world cup match

ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా అదరగొట్టింది. శనివారం ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కమ్మిన్స్ (3/40), జాంపా (3/60), స్టొయినిస్ (2/37) ధాటికి మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘన్ 38.2 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది. నజిబుల్లా జద్రాన్ (49 బంతుల్లో 51; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకం సాధించగా.. రహ్మత్ షా (43) రాణించాడు. చివర్లో రషీద్ ఖాన్ (11 బంతుల్లో 27; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) ఎడాపెడా బౌండ్రీలు బాదడంతో స్కోరు 200 దాటింది. అనంతరం లక్ష్యఛేదనలో ఆసీస్ ఓపెనర్లు అరోన్ ఫించ్ (49 బంతుల్లో 66; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), వార్నర్ (114 బంతుల్లో 89 నాటౌట్; 8 ఫోర్లు) విజృంభించడంతో ఆసీస్ 34.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది. వార్నర్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ప్టెన్ అరోన్ ఫించ్ ఆరంభం నుంచే విరుచుకుపడటంతో ఆసీస్ ఛేదన సాఫీగా సాగింది. ముజీబ్ వేసిన తొలి ఓవర్‌లో 2 ఫోర్లు బాదిన ఫించ్.. అతడి మరుసటి ఓవర్‌లో 6,4 కొట్టాడు. వార్నర్ కూడా మంచి షాట్‌లు ఆడటంతో 10 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ వికెట్ నష్టపోకుండా 55 పరుగులు చేసింది. దౌలత్ బౌలింగ్‌లో 6,4 అరుసుకున్న ఫించ్.. రషీద్ తొలి ఓవర్‌లో అతడికీ ఇదే శిక్ష వేసి 40 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు.

తొలి వికెట్‌కు 96 పరుగులు జోడించాక ఫించ్ ఆఫ్‌డ్రైవ్ ఆడే ప్రయత్నంలో ముజీబ్‌కు చిక్కాడు. అప్పటి వరకు నెమ్మదిగా ఆడిన వార్నర్ అక్కడి నుంచి గెలుపు బాధ్యత భుజానికెత్తుకొని చివరి వరకు నిలిచి జట్టును గెలిపించాడు. ఖవాజా (15), స్మిత్ (18) తలా కొన్ని పరుగులు చేశారు. స్టార్క్ వేసిన తొలి ఓవర్‌లో షహజాద్ (0) బౌల్డ్ కాగా.. మరుసటి ఓవర్‌లో హజ్రతుల్లా కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆరంభంలోనే 2 వికెట్లు పడ్డా హష్మతుల్లా (18)తో కలిసి రహ్మత్ షా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. దీంతో పవర్ ప్లే ముగిసేసరికి ఆఫ్ఘన్ 37/2తో నిలిచింది. కౌల్టర్‌నైల్ బౌలింగ్‌లో రెండు ఫోర్లు కొట్టిన హష్మతుల్లా.. జాంపా బౌలింగ్‌లో స్టంపౌటయ్యాడు. అర్ధసెంచరీవైపు సాగుతున్న రహ్మత్ షా, ఆల్‌రౌండర్ నబీ (7) వెంటవెంటనే ఔటవడంతో ఆఫ్ఘన్ 77 పరుగులకు సగం వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్ గుల్బదీన్ నైబ్ (31; 4 ఫోర్లు, 1 సిక్స్), నజీబుల్లా చక్కటి షాట్లతో స్కోరును ముందుకు నడిపించారు. ఆరవ వికెట్‌కు 83 పరుగులు జోడించాక స్టొయినిస్ ఒకే ఓవర్‌లో వీరిద్దరినీ ఔట్ చేశాడు. ఆఖర్లో రషీద్ ఖాన్.. 6,4,4,6 బాది జట్టు స్కోరు రెండొందలు దాటించాడు.

Related posts