telugu navyamedia
Uncategorized క్రీడలు ట్రెండింగ్

మూడో వన్డే లో .. పోరాడి .. ఓడిన భారత్.. !

india-Australia t20 match today

భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలియా మీద భారత్ పరాజయం పాలైంది. వరుసగా మూడో వన్డే గెలిచి సిరీస్‌ను ఖాతాలో వేసుకుందామనుకున్న కోహ్లీసేనకు నిరాశే ఎదురైంది. పరుగుల వరద పారిన రాంచీ వన్డేలో ఆస్ట్రేలియాదే పైచేయి అయ్యింది. ఉస్మాన్ ఖవాజ శతకానికి తోడు ఫించ్ హార్డ్‌హిట్టింగ్‌తో మూడు వందల స్కోరు అందుకున్న ఆసీస్ సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటింది. పేలవ ఫీల్డింగ్‌తో ప్రత్యర్థికి అవకాశాలిచ్చిన మనోళ్లు ఆఖర్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి కళ్లెం వేశారు. నిర్దేశిత లక్ష్యఛేదనలో భారత్‌కు మెరుగైన శుభారంభం దక్కలేదు.

27 పరుగులకే ఓపెనర్లు ధవన్(1), రోహిత్‌శర్మ(14)తో పాటు రాయుడు(2) పెవిలియన్ చేరుకున్నారు. రోహిత్, రాయుడును కమ్మిన్స్ ఔట్ చేయగా, పేలవ ఫామ్‌తో జట్టుకు భారంగా మారిన ధవన్..రిచర్డ్‌సన్‌కు వికెట్ ఇచ్చుకున్నాడు. ఈ దశలో కెప్టెన్ కోహ్లీ, లోకల్ హీరో ధోనీతో కలిసి ఇన్నింగ్స్‌ను గట్టెక్కించే ప్రయత్నం చేశారు. ఇద్దరు సూపర్ ఫామ్‌మీద ఉండటంతో అలవోకగా లక్ష్యం అందుకుంటారని అనిపించింది. జవాన్లకు మద్దతుగా ఆర్మీ క్యాప్‌లు ధరించిన ఈ ఇద్దరు పోరాట స్ఫూర్తి కనబరిచారు.

అయితే జంపా బౌలింగ్‌లో షాట్ ఆడబోయిన ధోనీ..క్లీన్‌బౌల్డ్ కావడంతో రాంచీ స్టేడియంలో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. ఓవైపు వికెట్లు పడుతున్నా..ఆత్మవిశ్వాసంతో కోహ్లీ బ్యాటింగ్ కొనసాగించాడు. ఆసీస్ బౌలింగ్ దాడిని సమర్థంగా ఎదుర్కొంటూ మైదానం నలువైపులా కండ్లు చెదిరే షాట్లతో అలరించాడు. కంగారూలు నిర్దేశించిన 314 పరుగుల లక్ష్యఛేదనలో టీమ్‌ఇండియా 48.2 ఓవర్లలో 281 పరుగులకు ఆలౌటైంది.

కెప్టెన్ కోహ్లీ(95 బంతుల్లో 123, 16ఫోర్లు, సిక్స్) సెంచరీతో చెలరేగాడు. ఆడమ్ జంపా(3/70), కమ్మిన్స్(3/37), రిచర్డ్‌సన్(3/37) మూడేసి వికెట్లు పడగొట్టారు. తొలుత ఉస్మాన్ ఖవాజ(113 బంతుల్లో 104, 11ఫోర్లు, సిక్స్), ఫించ్ (99 బంతుల్లో 93, 10ఫోర్లు, 3సిక్స్‌లు) బ్యాటింగ్‌తో ఆసీస్ 50 ఓవర్లలో 313/5 స్కోరు చేసింది. కుల్దీప్ యాదవ్(3/64) మూడు వికెట్లు తీశాడు. సెంచరీతో జట్టు విజయంలో కీలకమైన ఖవాజకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.

ఇరు జట్ల మధ్య నాలుగో వన్డే మొహాలీలో ఆదివారం జరుగుతుంది.

Related posts