telugu navyamedia
క్రీడలు వార్తలు

నిజమైన రాహుల్ వ్యాఖ్యలు… టీ20 సిరీస్ కు వార్నర్ దూరం…

warner

భారత వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ వ్యాఖ్యలు నిజమయ్యాయి. భారత్‌తో వరుస విజయాలందుకొని వన్డే సిరీస్ సొంతం చేసుకున్న ఆస్ట్రేలియాకు గట్టి షాక్ తగిలింది. రెండు వన్డేల్లోనూ కోహ్లీసేనపై అర్ధశతకాలు సాధించిన ఆ జట్టు విధ్వంసకర ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ గాయం కారణంగా మిగిలిన పరిమిత ఓవర్ల మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఆదివారం రెండో వన్డే సందర్భంగా ఫీల్డింగ్‌ చేస్తూ అతను గాయపడిన సంగతి తెలిసిందే. తొడ కండరాల్లో నొప్పితో మైదానంలోనే విలవిల్లాడడంతో వెంటనే స్పందించిన ఆస్ట్రేలియా జట్టు వైద్య బృందం వార్నర్‌ను బయటకు తీసుకెళ్లింది. అనంతరం వైద్య పరీక్షలు చేయగా తీవ్రగాయమైనట్లు తేలింది. గాయం తీవ్రత కారణంగా వార్నర్ నామమాత్రపు మూడో వన్డేతో పాటు తర్వాత ఆడాల్సిన మూడు టీ20ల సిరీస్‌కు అందుబాటులో ఉండడని కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ స్పష్టం చేశాడు. వార్నర్‌ స్థానాన్ని జాన్‌ మాథ్యూ షార్ట్‌ భర్తీ చేస్తాడని తెలిపాడు. అలాగే తమ జట్టు ఇప్పటికే వన్డే సిరీస్‌ గెలుపొందడంతో.. టెస్టు సిరీస్‌కు ముందు ప్రధాన పేసర్‌ పాట్‌ కమిన్స్‌కు కూడా విశ్రాంతి ఇవ్వాలనుకున్నట్లు ఆసీస్‌ కోచ్‌ తెలిపాడు. అతని స్థానంలో డీఆర్సీ షార్ట్‌ను టీ20 జట్టులోకి తీసుకున్నారు.

వార్నర్‌, కమిన్స్‌ తమకు కీలక ఆటగాళ్లని, రాబోయే టెస్టు సిరీస్‌లో వాళ్లు రాణించాలంటే తగినంత విశ్రాంతి అవసరమని చెప్పాడు. డిసెంబర్‌ 17 నుంచి భారత్‌తో ప్రారంభమయ్యే 4 టెస్టుల సిరీస్‌ తమకెంతో ముఖ్యమని అన్నాడు. ఆ సిరీస్‌లో సత్తా చాటాలని అనుకుంటున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇక డేవిడ్ వార్నర్‌కు గజ్జ గాయం నుంచి కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని కామెంటేటర్ గిల్‌క్రిస్ట్ వ్యాఖ్యానించాడు. కనీసం 6 వారాల సమయం పడుతుందన్నాడు. దాంతో వార్నర్ టీ20 సిరీస్‌తో పాటు టెస్టు సిరీస్‌కు కూడా దూరమయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఆసీస్ ముందు జాగ్రత్తగా వార్నర్‌ను టీ20 సిరీస్‌ నుంచి తప్పించింది. టెస్ట్ సిరీస్ వరకు పూర్తిగా కోలుకోవాలనుకుంటుంది. డిసెంబర్ 17 నుంచి ఫస్ట్ టెస్ట్ మొదలు కానుంది. అయితే వార్నర్ గైర్హాజరీలో లబుషేన్ ఓపెనర్‌గా వచ్చే అవకాశం ఉంది.

Related posts