telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“జబర్దస్త్” వినోద్ పై హత్యాయత్నం… కారణం ఇదే

“జబర్ధస్త్” కామెడీ షో తెలుగు ప్రేక్షకులను ఎంతగా అలరిస్తుందో అందరికీ తెలిసిన విషయమే. తాజాగా ఈ ప్రోగ్రామ్‌లో ఆడ వేషంతో అలరించే వినోద్‌పై హత్యాయత్నం జరిగింది. కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. కాచిగూడ పరిధిలోని కుత్బిగూడలో వినోద్‌ అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. ఓ ఇంటి వివాదంలో వినోద్ పై తీవ్రంగా దాడి చేశారు. అందుకు కారణమేంటో వినోద్ పోలీసులకు తెలిపాడు. ఇంటి కొనుగోలుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులకు రూ.10 లక్షలు ఇచ్చానని, అయితే ఎంతకీ రిజిస్ట్రేషన్ చేయించకపోవడంతో పాటు, తన డబ్బు కూడా వెనక్కి ఇవ్వకపోవడంతో నిలదీశానని వినోద్ వెల్లడించాడు. సెటిల్మెంటు చేసుకుందాం రమ్మని చెప్పి తనపై హత్యాయత్నం చేశారని తెలిపాడు. రూ.10 లక్షలు అడ్వాన్స్ రూపంలో ఇచ్చానని, అయితే ఇల్లు ఇవ్వం, డబ్బులు ఇవ్వం పొమ్మని అవతలి వ్యక్తులు దౌర్జన్యం చేశారని వినోద్ వాపోయాడు. ఇంటి పైకి పిలిచి గొంతు నులిమి చంపే ప్రయత్నం చేశారని వివరించాడు. తప్పించుకుని కిందికి రాగా, వెంటపడి మరీ కడుపులో తన్నారని, తల చిట్లిందని, ఎముకలు విరిగిపోయాయని చెబుతూ కన్నీటిపర్యంతమయ్యాడు. ఈ ఘటనలో వినోద్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం వినోద్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు.

Related posts