Asha Jyoti for the Anatolians

అనాథలకు ఆశా “జ్యోతి”గా…

18

అనాధ బాలలకు తన జీవితాన్ని అంకితం చేసి ఆశా జ్యోతిగా నిలిచింది కర్నూల్ కు చెందిన ఓ వృద్దురాలు. కర్నూలు జిల్లాలోని మంత్రాలయ మండలం, తుంగభద్ర గ్రామానికి చెందిన ముత్తులక్ష్మి ‘జ్యోతి’ అనే పేరుతో ఆశ్రమం నెలకొల్పి నలభై ఏళ్ళుగా అనాధలకు కల్పతరువుగా మారింది. మొదట్లో ఒక చిన్నారితో మొదలైన ఈ ఆశ్రమం ఇప్పటివరకూ 200 మందికి పైగా ఆశ్రయం కలిపించింది. సరైన ఆదరణ లేని చిన్నారులకు ఆహారం, వసతి, విద్యాబుద్ధులు నేర్పిస్తూ ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దుతున్నారు.
మంత్రాలయం మండలం, ఖగల్లు గ్రామం ముత్తులక్ష్మి స్వస్థలం కాగా, వాళ్ళ కుటుంబం ముంబై కి వలస వెళ్ళింది. అప్పట్లో తాను చదివే పాఠశాలను “మదర్ థెరిస్సా” సందర్శించిన ఘటన ముత్తులక్ష్మిలో స్ఫూర్తి నింపింది. చదువు పూర్తయ్యాక ఒక రోజు అప్పుడే పుట్టిన శిశువును గుర్తు తెలీని వ్యక్తులు నిర్దయగా ముళ్ల పొదల్లో పారేసి వెళ్లిపోగా ముత్తులక్ష్మి చేరతీశారు. నాటి నుంచి అనాథలకు ఆశ్రయం కల్పిస్తూ ఆశ్రమంగా విస్తరించారు. ముత్తులక్ష్మి అండతో పలువురు ఉన్నత చదువు చదివి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. మరి కొంత మంది వివాహాలు చేసుకుని సంతోషంగా జీవిస్తున్నారు.
కుల ధృవీకరణ, అనాధగా గుర్తింపు లాంటి విషయాల్లో పిల్లల తరుపున సమస్యలతో ముత్తులక్ష్మి పోరాడాల్సిన పరిస్థితి నెలకొంది. వయసు పైబడినా చివరి వరకు అనాథలకు అండగా ఉంటానని తల్లి మనసును చాటుతున్నారు ముత్తు లక్ష్మి.