telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

ఆర్టిస్టు చంద్ర మృతి…

కరోనా కథలు , కన్నీటి వ్యధలు వింటుంటే మనసు మౌనంగా రోదిస్తుంది. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మరణ వార్తలు బాధిస్తూనే ఉంటున్నాయి . చంద్ర కూడా ఈ కరోనాకు బలై పోతాడని అనుకోలేదు .
చంద్ర కేవలం ఆర్టిస్టు మాత్రమే కాదు , కధకుడు , నటుడు , కళా దర్శకుడు , అన్నింటికీ మించి మంచి మిత్రుడు .
డెబ్బయ్యవ దశకం నుంచి చంద్ర వైభవం చూశాను . అప్పట్లో చాలామంది వర్ధమాన ఆర్టిస్టులకు చంద్ర గొప్ప ప్రేరణ .
చంద్ర తో నాకు 1975 నుంచి పరిచయం . చంద్ర ను మొదట పరిచయం చేసింది మా అన్నయ్య కోటేశ్వర రావు .
అప్పట్లో చంద్ర నారాయణ గూడలో ఉండేవారు . చిక్కడపల్లి నుంచి కాచిగూడా వెళ్లే మార్గంలో దీపక్ థియేటర్ దాటిన
తరువాత ఎడమ వైపు వచ్చే చిన్న వీధి లో కొంచెం ముందు కెళ్లిన తరువాత ఓ ఇంట్లో ఉండేవారు.. ఆ ఇల్లు ప్రసిద్ధ రచయిత త్రిపురనేని గోపీ చంద్ గారిది . ఆ ఇంట్లో సాయిచంద్ తో పాటు చంద్ర ఉండేవారు . 1980 ఆ ప్రాంతంలో అదే వీధిలో ఎడమ వైపు చివరి ఇంటికి మారారు. చంద్ర వుండే ఇంటి కిటికీ నుంచి చూస్తే రాజబహదూర్ వెంకట్రామా రెడ్డి మహిళా కళాశాల విద్యార్థులు కనిపించేవారు. అందుకే చంద్ర అమ్మాయిల బొమ్మలు అంత నాజూకుగా గీసేవారని అప్పట్లో చెప్పుకునేవారు .
1980లో నేను “మానవత” అనే కవితా పుస్తకానికి ముఖ చిత్రం గీయించాలనుకున్నప్పుడు నాకు చంద్ర గుర్తుకు వచ్చాడు . అయితే అప్పుడు చంద్ర క్షణం తీరికలేనతగా ఉండేవారు . నాలాంటి యువ కవి పుస్తకానికి బొమ్మ వేస్తారా ” అని సందేహించాను . అయినా వెళ్లి అడుగుదామని పుస్తకం కాపీ తీసుకొని ఓ రోజు వెళ్ళాను . పుస్తకం ఇచ్చి కవర్ పేజీ వేసి పెట్టండి అన్నాను.
“నువ్వు కోటేశ్వర రావు కదూ ?” అన్నారు .
నేను ‘అవును సర్ ” అన్నాను.
“సరే వారం రోజుల తరువాత రా ” అన్నారు .
“థాంక్ యు … మరి .. ?” ఆగాను .
కవర్ పేజీ గీసినందుకు ఎంత ఇవ్వాలి ? నా సందేహం అనేది చంద్ర కు అర్ధమైంది .
నవ్వి ” తరువాత చూద్దాం లే ” అన్నారు .
నేను వారం తరువాత వెళ్ళాను . అప్పటికే కవర్ పేజీ బొమ్మ గీసి రెడీగా పెట్టారు .
అది చూడగానే ఎక్స్ లెంట్ గా అనిపించింది . ఎన్ని సార్లు థాంక్స్ చెప్పానో
“డబ్బు మాత్రం తరువాత చెబుతాలే .. అని నీ మొదటి పుస్తకం కదా , కవిత్వం బాగుంది , అల్ ది బెస్ట్ ” అని చెప్పారు .
1980 జూన్ 1వ తేదీన అశోక్ నగర్ కేంద్ర గ్రంథాలయం లో కిన్నెర రఘురామ్ ఏర్పాటు చేసి కార్యక్రమంలో నా “మానవత ” కవితా పుస్తకానికి మహాకవి శ్రీ శ్రీ ముందు మాట వ్రాయడమే కాకుండా ఆయన స్వయంగా మద్రాస్ నుంచి హైదరాబాద్ వచ్చి ఆవిష్కరించారు .
ఈ కార్యక్రమంలో మహాకవి శ్రీ శ్రీ గారితో నా పుస్తకానికి అద్భుతమైన కవర్ పేజీ ఇచ్చిన చంద్రకు జ్ఞాపికను బహుకరించాము .
ఇది చంద్రకు మహదానందాన్ని ఇచ్చింది . ఆ తరువాత నేను ఎప్పుడు కలిసినా ఆ వియాన్ని గుర్తు చేస్తూ ” భగీరథా నేను మర్చిపోలేని
బహుమతి ఇచ్చావు . ” అనే వాడు .
ఆ తరువాత చంద్ర నిర్మాత దర్శకుడు బి నరసింగ రావు గారికి ఎంతో ఆత్మీయుడు . నరసింగ రావు రంగుల కల చిత్రంలో ఆర్టిస్టు పాత్రలో గొప్పగా నటించాడు . ఎన్నో సినిమాలకు కళా దర్శకుడుగా పనిచేశారు . ఓపెన్ యూనివర్సిటీ లో పనిచేటప్పుడు కూడా మిత్రుడు డాక్టర్ ఉమాపతి వర్మ గారిని కలవడానికి యూనివర్సిటీ వెళ్ళినప్పుడు చంద్రను తప్పకుండా కలుస్తూ ఉండేవాడిని .
చంద్ర మూడు తరాలను ప్రభావిత చేసిన సృజనాత్మక కళాకారుడు . ఆయనలో గొప్ప మానవతా విలువలున్నాయి . స్నేహితులంటే ఎంతో గౌరవిస్తాడు . కళాకారుడిగా ఎంత ఎదిగినా ఒదిగి ఉండేవాడు అదే ఆయన సంస్కారం .
చంద్ర కుంచె ఆగిపోయినా .. గతంలో ఆయన గీసిన చిత్రాలు . ఎప్పటికీ స్ఫూర్తి నిస్తూనే ఉంటాయి .  భగీరథ

Related posts