telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

పెళ్ళైన కొత్తజంట… నేరుగా జైలుకే… ఏం జరిగిందంటే ?

Arizona

వివాహమైన గంటల వ్యవధిలోనే కొత్త జంట కటకటాల పాలైంది. ఈ సంఘటన అమెరికాలోని అరిజోనాలో చోటు చేసుకుంది. పోలీసులపై పెళ్లికూతురు చేయి చేసుకోవడమే ఆ కొత్త దంపతులను జైలుపాలు చేసింది. ప్రెస్కోట్ పోలీసుల కథనం ప్రకారం… స్థానికంగా నివాసముండే యాష్లే జోర్డాన్ (30) అనే యువతికి ఎరిక్ కార్డోవా (31) అనే యువకుడితో శనివారం ఉదయం ప్రెస్కోట్‌‌లో ఘనంగా పెళ్లైంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు స్నేహితులు, బంధువులకు విందు ఇచ్చారు. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం ఇంటి నుంచి బయటకు వెళ్లిన వధువు యాష్లే రాత్రి 9.30 గంటల ప్రాంతంలో స్థానికంగా చిన్న వ్యాపారం చేసుకునే వ్యక్తితో గొడవ పడింది. ఈ ఘర్షణలో వధువు ఆ వ్యక్తిపై చేయిచేసుకుంది. దీంతో బాధితుడు పోలీసులకు సమాచారం అందించాడు. అతడి సమాచారంతో అక్కడి వచ్చిన ప్రెస్కోట్ పోలీసుల పట్ల వరుడు ఎరిక్ దురుసుగా ప్రవర్తించాడు. దీంతో ఎరిక్‌ను నచ్చజెప్పే క్రమంలో అతడు పొరపాటున కింద పడ్డాడు. అంతే… అది చూసిన నవవధువు యాష్లే నా భర్తనే కింద పడేస్తారా అంటూ పోలీసులపై విరుచుకుపడింది. చేతికి అందిన వాటితో వారిపై దాడి చేసింది. దాంతో పోలీసులు చేసేదేమిలేక ఆ కొత్త జంటను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిపై చట్ట అమలు అధికారిపై తీవ్ర దాడి కింద కేసు నమోదు చేసి యవపాయ్ కౌంటీ జైలులో పెట్టారు.

Related posts