telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్

ప్రతియేటా .. చార్జీలు పెంపు చేయాల్సి వస్తుంది.. : ఆర్టీసీ ఎండీ

apsrtc md surendrababu on employees demands

ఎండీ సురేంద్రబాబు ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె నోటీసుపై స్పందించారు. గత ఏడాది ఏపీఎస్ ఆర్టీసీకి రూ.1,205 కోట్ల నష్టం వచ్చిందని, ఆర్టీసీకి కిలోమీటర్ కు రూ.6.53 నష్టం వస్తోందని చెప్పారు. విజయవాడలో ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం ఆర్టీసీకి రూ.6,455 కోట్ల అప్పు ఉందని, డీజిల్ ధరల పెరుగుదల, సిబ్బంది వేతనాల వల్ల నష్టాలు పెరుగుతున్నాయని అన్నారు. డీజిల్ ధరల వల్ల ఆర్టీసీకి ఏటా రూ.600 కోట్ల నష్టం వస్తోందని, ఎంవీ ట్యాక్స్ ల రూపంలో ఆర్టీసీ ఏటా రూ.1,409 కోట్లు చెల్లిస్తోందని వివరించారు. 2018-19లో ఆర్టీసీ 78 శాతం ఆక్యుపెన్సీ రేషియో సాధించిందని, అంతర్గత పొదుపు చర్యల ద్వారా ఆదాయం పెంచుకున్నట్టు చెప్పారు. 2018-19లో ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి రూ.554 కోట్ల సాయం అందిందని అన్నారు.

కొత్త బస్సులు ప్రవేశపెట్టేందుకు ఆర్టీసీకి రూ.250 కోట్లు కావాలని; కొత్త బస్సులు, పాత బస్సుల మార్పు కోసం రూ.666 కోట్లు అవసరం ఉందని సురేంద్రబాబు అన్నారు. ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి కేటాయిస్తున్న నిధులు మరింత పెంచాలని, 2019-20 బడ్జెట్ లో రూ.3,717 కోట్ల సాయం చేయాలని కోరినట్టు చెప్పారు. ఎంవీ ట్యాక్స్ మినహాయింపు, పల్లె వెలుగు బస్సులపై వచ్చే నష్టాలను భరించాలని కోరారు. డీజిల్ ధరలకు అనుగుణంగా ప్రతి ఏటా 30 శాతం ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఛార్జీల పెంపు ప్రతిపాదనలను ప్రభుత్వానికి త్వరలో పంపుతామని చెప్పారు. ఆర్టీసీలో ఏ ఉద్యోగిని తొలగించమని ఈ సంద్భంగా సురేంద్ర బాబు స్పష్టం చేశారు.

Related posts