ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ ఆర్టీసీ బాదుడు మొదలైంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకడంతో సామాన్యులు చుక్కలుచూస్తున్నారు.
తాజాగా డీజిల్ సెస్ పేరుతో రాష్ట్ర ప్రజలకు ఏపీ ప్రభుత్వం షాకిచ్చింది. ఇప్పటి నుంచి డీజిల్ సెస్‌ను దూరాన్ని బట్టి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డీజిల్ సెస్ పెంపుదల కారణంగా ఆర్టీసీ చార్జీలు పెంచక తప్పలేదని ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ సీహెచ్.ద్వారకా తిరుమలరావు వెల్లడించింది. పెరిగిన ఛార్జీలు శుక్రవారం నుంచే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.
సాధారణంగా ప్రయాణ దూరాన్ని బట్టి కనిష్టంగా 10 రూపాయలు, గరిష్టంగా 140 రూపాయలకు పైగా ఆర్టీసీ డీజిల్ సెస్ వసూలు చేయనుంది. బేసిక్ ఛార్జీ, డీజిల్ సెస్ కలిపి కిలోమీటర్ల ప్రతిపాదికన మొత్తం ఛార్జీని నిర్ణయించింది. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు మినహా అన్ని బస్సుల్లో కనీస ఛార్జీలను ఆర్టీసీ పెంచింది.
ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సుల్లో కనీస ఛార్జీని 5 రూపాయల మేర పెంచగా.. దూరప్రాంతలు వెళ్లే ఏసీ, నాన్ ఎసీ, స్లీపర్ బస్సుల్లో కనీస ఛార్జీని 10 రూపాయల మేర పెంచింది. పల్లెవెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు బస్సుల్లో కనీస ఛార్జీ 10 రూపాయలు యథాతథంగా ఉంచింది. ఛార్జీల పెంపుదలతో విద్యార్థుల బస్‌పాస్ ఛార్జీలు 20 శాతం మేర పెరిగే అవకాశం ఉన్నది.
కనీస ఛార్జీల పెంపుతో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో కనీస ఛార్జీ 20 రూపాయలుగా, అల్ట్రా డీలక్స్ బస్సుల్లో కనీస ఛార్జీ 25 రూపాయలుగా, సూపర్ లగ్జరీ బస్సుల్లో కనీస ఛార్జీ 40 రూపాయలుగా, ఇంద్ర బస్సుల్లో ఇకపై కనీస ఛార్జీ 50 రూపాయలుగా, గరుడ బస్సుల్లో ఇకపై కనీస ఛార్జీ 50 రూపాయలుగా, మెట్రో లగ్జరీ ఏసీ బస్సుల్లో ఇకపై కనీస ఛార్జీ 50 రూపాయలుగా, అమరావతి ఎసీ బస్సుల్లో ఇకపై కనీస ఛార్జీ 50 రూపాయలుగా, వెన్నెల స్లీపర్ బస్సుల్లోఇకపై కనీస ఛార్జీ 80 రూపాయలుగా ఉండనున్నాయి.
పెంచిన ఛార్జీలు ఇలా…
బస్సు సర్వీసు రూపాయల్లో
పల్లెవెలుగు/అల్ట్రా 10
ఎక్స్‌ప్రెస్ 20
డీలక్స్/అల్ట్రా 25
సూపర్ లగ్జరీ 40
అన్ని ఏసీ సర్వీసులు 50