నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం రామచంద్రారెడ్డి నగర్ వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా.. 34 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఆత్మకూరు డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు, నెల్లూరు వస్తుండగా బళ్లారి రహదారిపై దామరమడుగు మఠం కాలనీ వద్ద ఆగి ఉన్న లారీని వెనుక వైపు నుంచి ఢీ కొట్టింది. అనంతరం రోడ్డుపై నుంచి 15 అడుగుల లోతులో ఉన్న పంటపొలాల్లోకి బోల్తా పడింది.
ప్రమాద సమయంలో బస్సులో 40మంది ప్రయాణికులు ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. క్షతగాత్రులను 108 వాహనాల్లో నెల్లూరులోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.