ఏపీ లో సచివాలయ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు నిర్వహించి ఎంపికైన వారందరికీ నియామక పత్రాలు అందించడానికి రంగం సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా ఈ నెల 30న ఎంపికైన వారందరికీ ఒకేసారి నియామక పత్రాలు అందించనున్నారు .అయితే తొలి నియామక పత్రాన్ని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన చేతుల మీదుగా అందించనున్నారు. విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో నియామక పత్రాల పంపిణీ లో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొననున్నారు. ఆయన చేతుల మీదుగా తొలి నియామక పత్రాన్ని అందించనున్నారు. ఆయన అక్కడ నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగాలకు ఎంపికైన వారిని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తారు.
ఈ నేపథ్యంలో 13 జిల్లాల్లో ఉద్యోగాలకు ఎంపికైనవారు సీఎం ప్రసంగాన్ని వీక్షించేలా ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామ సచివాలయ సిబ్బందిగా సేవలు అందించే వారందరికీ జగన్ తన ప్రసంగం ద్వారా దిశా నిర్దేశం చెయ్యనున్నారు. ఇప్పటికే కేటగిరీ -1 ఉద్యోగాల్లో నాలుగు రకాలకు ఒకే రాతపరీక్ష నిర్వహించిన నేపధ్యంలో ఎంపికైన అభ్యర్థులు దరఖాస్తులో ఆ నాలుగింటిలో మొదటి ప్రాధాన్యత కింద కోరుకున్న దాని ప్రకారం ఉద్యోగాల కేటాయింపు చేయాల్సి ఉంది. ఇది కాస్త సంక్లిష్టతతో కూడుకోవడంతో జాబితాల వెల్లడి ఆలస్యమవుతోందని అధికారులు వెల్లడించారు. ఒకవేళ పరీక్షల్లో ఉత్తీర్ణులైనప్పటికీ సెప్టెంబర్ 30 నాటికి సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తికాని వారికి వెరిఫికేషన్ పూర్తయిన వెంటనే అక్కడికక్కడే నియామక పత్రాలు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
విజయవాడలో సీఎం జగన్ నియామక పత్రాలు అందించే సమయంలోనే ఇక జిల్లాల్లో జిల్లా మంత్రులు నియామక పత్రాలను అందించారు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. సచివాలయ వ్యవస్థకు తూర్పు గోదావరి జిల్లాలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టనున్నారని అధికారులు తెలిపారు. అక్టోబర్ 2న కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని కరప గ్రామంలో సచివాలయ భవనాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇప్పటికే దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.